సరిగ్గా రెండు నెలలు క్రితం. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి - నిరంతరం కేసీఆర్ మీద దాడి చేసే జగ్గారెడ్డి సడెన్‌గా సాఫ్ట్ టోన్‌లో మొదలుపెట్టాడు. నేను ప్రజా ప్రతినిధి. కేసీఆర్ సీఎం. నా నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యం. సీఎం ను కలుస్తాను. నిధులు సాధిస్తాను. మళ్లీ ఎన్నికల వరకు రాజకీయాలు చేయను... వంటి వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మళ్లీ ఓ వారం గ్యాప్‌తో కేసీఆర్ మంచోడే. హరీష్ దుర్మార్గుడు అన్నాడు. ఇపుడు ఏకంగా పార్టీయే ఫిరాయిస్తున్నాడు. అందరూ పార్టీ మారడం ఒకెత్తు. జగ్గారెడ్డి మారడం ఇంకొకెత్తు.
జగ్గారెడ్డి నిర్ణయం నియోజకవర్గ ప్రజలకు కాదు, ఆయన అనుచరులకు కూడా మింగుడు పడటం లేదంటున్నారు. అందుకే వారికి కూడా దొరక్కుండా నిన్నటినుంచి జగ్గారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫోన్ లోనూ ఆయన అందుబాటులో లేరు. ఆయన చేరిక వచ్చిన ఏ వార్తను ఆయన ఖండించలేదు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన వాయిస్‌లోనే పార్టీ మారతాడని చాలా మందికి అర్థమైంది. ఇపుడు అది నిజమవుతోంది.
ఒక పుడు టీఆర్ఎస్‌ను తరిమి తరిమి కొడతాను అని చెప్పిన ఆయన ఇపుడు అదేపార్టీలోకి నిరభ్యంతరంగా పోతున్నాడు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన అతికొద్ది మందిలో ఈయనొకడు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్రకు అనుకూలంగా మాట్లాడిన ఈయనను నియోజకవర్గ ప్రజలు ఎంతో అభిమానించారు. టీఆర్ఎస్ వేవ్‌లో కూడా జగ్గారెడ్డికి మద్దతు ఇచ్చారు. అయితే, ఇపుడు ప్రజలకు జగ్గారెడ్డి షాకిస్తూ ప్లేటు ఫిరాయించాడు. ఇప్పటికే కాంగ్రెస్ సగం ఖాళీ అయ్యింది. కానీ ఇంకా వలసలు ఆగలేదు.