పార్టీ మార‌నంటూనే.. షాకింగ్ మాట చెప్పిన జ‌గ్గారెడ్డి

Update: 2019-06-09 12:36 GMT
తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని గురి పెట్టిన తెలంగాణ అధికార‌ప‌క్షం.. ఆ కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల క్రిత‌మే డ‌జ‌న్ మంది ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ చీలిక వ‌ర్గం పేరుతో టీఆర్ఎస్ లో క‌లిసిపోవ‌టం తెలిసిందే. రూల్ కు త‌గ్గ‌ట్లే జ‌రిగిన ఈ ప్ర‌క్రియ‌పై కాంగ్రెస్ గ‌గ్గోలు పెడుతుంటే.. రూల్ ప్ర‌కారం చేసిన త‌ర్వాత కూడా పెడ‌బొబ్బలు ఏమిటంటూ టీఆర్ఎస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇలా జంపింగ్ కావాల్సిన ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌మ్ ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే.. ఆయ‌న మీద ఎంత ప్ర‌చారం జ‌రుగుతుందో.. అంతే బ‌లంగా తాను పార్టీ మార‌నంటే మార‌న‌ని చెబుతున్నారు. మొద‌ట్లో జ‌గ్గారెడ్డిని తీసుకోవ‌టానికి కేసీఆర్ సుముఖంగా లేర‌న్న ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత జ‌గ్గారెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చినా.. ఆయ‌న ఓకే అన‌లేని ప‌రిస్థితి.

ఒక‌ప్పుడు టీఆర్ఎస్ లో ఉండి.. కేసీఆర్ తో విబేధించి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ్గారెడ్డి.. తాను చేసిన ప‌నికి ఇప్పుడు తెగ ఫీల్ అవుతున్నారు. ఒక‌ప్పుడు కేసీఆర్ అంటే అంతెత్తు లేచి ప‌డే ఈ ఫైర్ బ్రాండ్‌.. ఇప్పుడు తాను పార్టీని వ‌దిలి ఉండాల్సింది కాద‌న్న భావ‌న‌ను వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

తాజాగా మీడియాతో మాట్లాడినాయ‌న‌.. తాను గ‌తంలో టీఆర్ఎస్ ను వీడ‌టం త‌ప్పేన‌ని చెప్పిన ఆయ‌న‌.. తాజాగా కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యేల‌ది కూడా త‌ప్పేన‌ని చెప్పారు. తానిక కాంగ్రెస్ ను విడిచిపెట్టేది లేద‌న్న ఆయ‌న‌.. ఎమ్మెల్యేల ఫిరాయింపులో పార్టీ నాయ‌క‌త్వ వైఫ‌ల్యం ఎంత మాత్రం కార‌ణం కాద‌న్నారు. ఎమ్మెల్యేలు ఎవ‌రికి వారు వారి సొంత అవ‌స‌రాల కోసం వెళ్లిపోతున్నార‌న్నారు.

నేత‌లు ఎవ‌రికి వారు.. వెళ్లిపోతుంటే.. రాహుల్ గాంధీ.. ఉత్త‌మ్ లాంటి వాళ్లు ఏం చేయ‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నించారు. తాజాగా చోటు చేసుకుంటున్న రాజ‌కీయాల్ని చూస్తుంటే.. పాలిటిక్స్ ను విడిచి వెళ్లిపోవాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు. ఒక‌ప్పుడు ఇదే జ‌గ్గారెడ్డి.. టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విష‌యం తెలిసిందే.


Tags:    

Similar News