బాబును కాకా ప‌డుతున్న జ‌య‌, కరుణ‌

Update: 2016-08-08 07:00 GMT
త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌ - ఆ రాష్ట్ర విప‌క్ష నేత క‌రుణానిధులు ఒక్క‌సారిగా ఒక్క‌టైపోయారు! ఏపీ సీఎం చంద్ర‌బాబును అందిన‌కాడికి కాకా ప‌ట్టేందుకు సిద్ధ‌మైపోయారు. అదేంటి.. ఉప్పునిప్పులా మండిప‌డే ఈ ఇద్ద‌రు ఎలా ఎందుకు ఒక్క‌టైపోయారాని సందేహిస్తున్నారా? అక్క‌డి వ‌ద్దాం. దేశంలో మ‌రెక్క‌డా ల‌భించ‌ని - అత్య‌ధిక డిమాండ్ ఉన్న ఎర్ర‌చంద‌నంపై మాఫియా క‌న్నేయ‌డం - శేషాచ‌లం అడ‌వుల‌ను ఇష్టారాజ్యంగా న‌రికేయ‌డంపై క‌న్నెర్ర చేసిన సీఎం చంద్ర‌బాబు.. ఎర్ర దొంగ‌ల‌పై ఉక్కుపాదం మోపారు. ప్ర‌త్యేకంగా టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి.. మ‌రీ ఎర్ర చంద‌నం దొంగ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ‌నాడుకు చెందిన కొంద‌రు శేషాచ‌లంలో ఎర్ర‌చంద‌నం చెట్ల‌ను న‌రికేందుకు కూలీలుగా వ‌స్తున్న నేప‌థ్యంలో వారిపైనా ఎక్క‌డిక‌క్క‌డ ఏపీ పోలీసులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, ఏడాది కింద‌ట శేషాచలం అడ‌విలో జ‌రిగిన ఎన్‌ కౌంట‌ర్‌  లో దాదాపు 18 మంది త‌మిళ‌కూలీలు హ‌త‌మ‌య్యారు. అప్ప‌ట్లో వారి నుంచి చెట్ల‌ను న‌రికే ఆయుధాలు స‌హా వాళ్లు న‌రికి త‌ర‌లించ‌డానికి సిద్ధం చేసిన దుంగ‌ల‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టు విచార‌ణ‌లో ఉంది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ప్ర‌భుత్వం.. త‌మిళ కూలీల‌ను శేషాచ‌లంలోకి అడుగు పెట్ట‌నీయ‌కుండా ప‌లు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో వారిని ముంద‌స్తుగానే గుర్తించి అరెస్టు చేయ‌డం - వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకోవ‌డం వంటివి చేస్తోంది. ఇక‌, తాజాగా మ‌రో 32 మంది త‌మిళకూలీలు  శేషాచ‌లంలోకి వెళ్లి చెట్టు న‌రికేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న ప‌క్కా స‌మాచారంతో పోలీసులు వారిని రేణిగుంట రైల్వేస్టేష‌న్ వ‌ద్ద అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌ కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో వారి నుంచి ఆయుధాల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అయితే, వీరంతా అమాయ‌కుల‌ని - కేవలం తిరుమ‌ల‌లోని శ్రీవారిని ద‌ర్శించుకునేందుకే వెళ్లార‌ని అలాంటి వారిని అరెస్టు చేసి ఏపీ త‌న అక్క‌సు తీర్చుకుంటోంద‌ని త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌క్షాలు ఆరోప‌ణ‌లు సంధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన సీఎం జ‌య‌ల‌లిత.. త‌మ వారిని విడిపించాల‌ని సీఎం చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రోప‌క్క‌, ఆమె 32 మంది త‌ర‌ఫున అధికారికంగా న్యాయ‌పోరాటానికి కూడా సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌ను నియ‌మించారు. ఇదిలావుంటే - విప‌క్ష నేత డీఎంకే అధినేత క‌రుణానిధి కూడా సీఎం చంద్ర‌బాబుకు లేఖ‌రాశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చంద్ర‌బాబును త‌న ఆప్త‌మిత్రునిగా పోల్చ‌డం గ‌మ‌నార్హం. ఆ 32 మంది అమాయ‌కుల‌ని - వారు నిజంగానే బాలాజీ ద‌ర్శ‌నం కోస‌మే రేణిగుంట‌లో ఆగార‌ని దీనిని మాన‌వ‌తా ధృక్ప‌థంతో అర్ధం చేసుకోవాల‌ని ఆయ‌న చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు.

ఇక‌, వైగో - విజ‌య్‌ కాంత్ లు మాత్రం చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. అయితే, ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌చ్చేస‌రికి మాత్రం త‌మిళ‌నాడు పూర్తిగా విభేదించ‌డ‌మే. ఇప్పుడు త‌మ ప్ర‌యోజనం కోసం ఒక్క‌టైన‌ట్టే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తారేమోన‌ని భావించిన త‌మిళ‌నాడు నేత‌లు(వీరే) కేంద్రానికి అప్ప‌ట్లో లేఖ‌ల‌మీద లేఖ‌లు సంధించి.. ఎట్టి ప‌రిస్థితిలోనూ హోదా ఇవ్వ‌ద్దని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News