జేసీ దివాక‌ర్ రెడ్డికి హైకోర్టు షాక్‌!

Update: 2017-07-17 15:29 GMT
ఫైర్ బ్రాండ్‌, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. త‌న‌పై విమాన‌యాన సంస్థ‌లు విధించిన ట్రావెల్ బ్యాన్ ను సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ‘దివాకర్‌ ట్రావెల్స్‌లో ఇలాంటి సంఘటనలు జరిగితే అనుమతిస్తారా?’ అని జేసీని న్యాయ‌స్థానం ప్రశ్నించింది.

పార్లమెంట్ వర్షాకాల స‌మావేశాలు జరుగుతున్నందున తాత్కాలిక అనుమతినివ్వాల‌న్న‌ జేసీ తరఫు న్యాయవాది అభ్య‌ర్థ‌న‌ను హైకోర్టు తోసి పుచ్చింది. అయితే, విమానయాన సంస్థల వాదనలు వినకుండా అనుమ‌తించ‌డం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తనపై దేశీయ విమానయాన సంస్థలు నిషేదం విధించడం న్యాయసూత్రాలకు విరుద్ధమని జేసీ దివాకర్‌రెడ్డి  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేలా విమాన‌యాన సంస్థ‌ల‌ను ఆదేశించాలని కోరిన సంగ‌తి తెలిసిందే.

జూన్‌ 15న విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలస్యంగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో బోర్డింగ్‌ పాస్‌ను నిరాకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందితో జేసీ గొడవపడిన విషయం తెలిసిందే. ట్రావెల్ బ్యాన్ ఉన్నందున‌ జేసీ దివాకర్‌ రెడ్డి ....రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తన స్నేహితుడి ప్రయివేట్‌ విమానంలో ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News