జేసీకి వార్నింగ్ ఇచ్చిన పోలీస్ వైసీపీలోకి?

Update: 2018-12-29 07:49 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌ల బాగా పాపుల‌ర్ అయిన పోలీసు గోరంట్ల మాధ‌వ్‌. క‌దిరి అర్బ‌న్ సీఐగా ఉన్న ఆయ‌న ఏకంగా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి బ‌హిరంగంగా వార్నింగ్ ఇవ్వ‌డం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించారు. పోలీసుల‌పై అనుచిత ప‌ద‌జాలం ఉప‌యోగిస్తే నాలుక తెగ్గోస్తానంటూ రాజ‌కీయ నాయ‌కుల‌కు ఆయ‌న చేసిన హెచ్చ‌రిక చూసి అంతా నోరెళ్ల‌బెట్టారు.

తాజాగా గోరంట్ల మాధ‌వ్ గురించి ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కొచ్చింది. ఆయ‌న త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు రాజీనామా ప‌త్రాన్ని ఉన్నతాధికారుల‌కు ఇప్ప‌టికే పంపించేశార‌ని స‌మాచారం. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించేందుకు మాధ‌వ్ ఉద్యోగానికి రాజీనామా చేశార‌ని ప‌లు వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పోలీసు అధికారిగా గోరంట్ల మాధ‌వ్ ప్ర‌జ‌ల్లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. అనంత‌పురం జిల్లాలో ఉండి ఆ జిల్లా కీల‌క నేత‌కు వార్నింగ్ ఇవ్వ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు. అందుకే ఆయ‌న ప్ర‌జ‌ల్లో బాగా పాపుల‌ర్ అయ్యారు. ఈ పాపులారిటీని రాజ‌కీయాల్లో ఉప‌యోగించుకోవాల‌ని మాధ‌వ్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గోరంట్ల మాధ‌వ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌ని - హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తార‌ని బాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం హిందూపురం ఎంపీగా టీడీపీ నేత నిమ్మ‌ల కిష్ట‌ప్ప ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున‌ ఆయ‌నే బ‌రిలో దిగ‌డం దాదాపు ఖాయం. అక్క‌డ వైసీపీకి మాత్రం స‌రైన అభ్య‌ర్థి లేడు. ద‌మ్మున్న వ్య‌క్తిగా గోరంట్ల మాధ‌వ్ కు ఇప్ప‌టికే జ‌నాల్లో మంచి పేరు ఉంది. కాబ‌ట్టి ఆయ‌న పార్టీలో చేరితే ఆయ‌న‌కే వైసీపీ హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని రాజకీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప‌లు స‌మీక‌ర‌ణాల రీత్యా హిందూపురంలో రెడ్డి కులమేత‌ర వ్య‌క్తి పోటీకి పార్టీలు ప్రాధాన్య‌మిస్తుంటాయి. మాధ‌వ్ కు ఈ స‌మీక‌ర‌ణం కూడా వైసీపీలో క‌లిసి వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News