మెర్సెల్ వ‌ర్సెస్ బీజేపీ... క‌మ‌ల్ ట్విస్ట్ ఇచ్చేశారు!

Update: 2017-10-21 04:34 GMT
కోలీవుడ్ టాప్ స్టార్ విజ‌య్ న‌టించిన త‌మిళ సినిమాకు చిన్న‌గా రాజ‌కీయ రంగు కూడా వ‌చ్చేసింది. మెడిక‌ల్ మాఫియాను ల‌క్ష్యంగా చేసుకుని తెర‌కెక్కిన ఈ చిత్రం మూడు రోజుల క్రితం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. విడుద‌ల‌కు ముందే హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంలోని క‌థాంశాన్ని తెలుసుకున్న త‌మిళ‌నాడు వైద్యులు... ఈ చిత్రాన్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్లుగా సంచ‌ల‌న ప్ర‌కట‌న చేశారు. మెడిక‌ల్ మాఫియా కేంద్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో వైద్యుల‌ను త‌ప్పుగా చూపించార‌న్న‌ది అక్క‌డి డాక్ట‌ర్ల వాద‌న‌. స‌రే సినిమా అన్నాకా.. ఏదో ఒక వ‌ర్గం ఆరోప‌ణ‌లు చేయ‌డం, ఆ త‌ర్వాత స‌ద్దుమ‌ణ‌గ‌డం స‌ర్వ‌సాధార‌ణం అయిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలో ఇది కూడా అలాగే స‌ద్దుమ‌ణుగుతుందిలే అని అనున్నా... అందుకు విరుద్ధంగా ఈ చిత్రంపై విమ‌ర్శ‌ల జ‌డివాన అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.

తాజాగా ఈ చిత్రంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది. చిత్రంలో మెడిక‌ల్ మాఫియాతో పాటుగా డిజిటల్‌ ఇండియా - జీఎస్టీ అమలుపై సంధించిన‌ డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌క్ష‌ణ‌మే స‌ద‌రు డిజిట‌ల్ ఇండియా - జీఎస్టీ అమ‌లుపై చిత్రంలో ఉన్న డైలాగుల‌ను తొల‌గించాల‌ని కూడా బీజేపీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఓ వైపు త‌మిళ‌నాడు వైద్యులు - ఆ త‌ర్వాత బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ రంగంలోకి దిగిపోగా... కోలీవుడ్‌ కే చెందిన మ‌రో సీనియ‌ర్ హీరో - ఇటీవ‌లి కాలంలో రాజ‌కీయంగా సంచ‌ల‌న కామెంట్ల‌తో యావ‌త్తు దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్ కూడా రంగంలోకి దిగిపోయారు.

త‌మిళ‌నాడు వైద్యుల‌తో పాటు బీజేపీ నేత‌లు మెర్సెల్ చిత్రంపై చేస్తున్న వాద‌న‌లు క‌రెక్ట్ కాద‌ని క‌మ‌ల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌తో మెర్సెల్ చిత్రంతో పాటుగా ఆ చిత్ర హీరో విజ‌య్‌ కు ఆయ‌న అండ‌గా నిలిచిన‌ట్లైంద‌న్న వాద‌న వినిపిస్తోంది.  సినిమాను అన్నివిధాలుగా సెన్సార్‌ బోర్డు సెన్సార్‌ చేసిందన్నాడు. అయినా సెన్సార్ ప‌రిశీల‌న త‌ర్వాతే క‌దా సినిమా విడుద‌లైందంటూ కాస్తంత క‌ర‌కు స్వ‌రాన్నే వినిపించిన క‌మ‌ల్‌.. సెన్సార్ పూర్తి చేసుకుని విడుద‌లైన చిత్రంలోని స‌న్నివేశాల‌ను తీసివేయాల‌ని చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని కూడా ప్ర‌శ్నించారు. త‌మిళ‌నాడు వైద్యులు - బీజేపీ నేత‌లు చెబుతున్న‌ వివాదాస్పద సన్నివేశాలను తీసేయాల్సిన అవసరం ఎంత‌మాత్రం లేదని కూడా క‌మ‌ల్ పేర్కొన్నాడు. వ్యవస్థపై సరైన రీతిలో విమర్శలు చేయడంలో తప్పులేదని క‌మ‌ల్‌ అభిప్రాయపడ్డారు. మ‌రి ఈ వివాదం ఎంత‌దాకా దారి తీస్తుందో చూడాలి. ఈ వివాదాలు ఎలా ఉన్నా... రిలీజ్‌ కు ముందే హిట్ టాక్ అందుకున్న మెర్సెల్‌...  బాక్సాఫీసు వ‌ద్ద త‌న‌దైన మార్కు క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. కోలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డులు కూడా సృష్టించే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News