క‌మ‌ల్‌ కు సీఎం యోగం లేద‌ట‌!

Update: 2017-10-09 07:57 GMT
త‌మిళ‌నాట రాజ‌కీయ రంగ ప్ర‌వేశం కోసం ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చాలా వేగంగా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. త‌మిళ‌నాడు సీఎంగా ఉండ‌గానే తీవ్ర అనారోగ్యానికి గురైన‌ జ‌య‌ల‌లిత ఆ తర్వాత చ‌నిపోవ‌డంతో అక్క‌డి రాజ‌కీయాలు ఒక్క‌సారిగా భారీ కుదుపున‌కు గుర‌య్యాయ‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో అక్క‌డి రాజ‌కీయ శూన్య‌త‌ను క్యాష్ చేసుకుని సినిమాల త‌ర‌హాలోనే రాజ‌కీయాల్లోనూ రాణించాల‌ని త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యోచించారు. త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటూ ఆయ‌న నుంచి వ‌చ్చిన ఓ పరోక్ష ప్ర‌క‌ట‌న పెను ప్ర‌కంప‌న‌ల‌నే సృష్టించింద‌ని చెప్పాలి. ఇందులో భాగంగా ర‌జ‌నీ... రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ప‌య‌నించారు. ఇప్ప‌టికీ ఆయ‌న నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాలేదు.

అయితే  మొన్న‌టిదాకా సినిమాల‌కే ప‌రిమిత‌మైన మ‌రో సీనియ‌ర్ న‌టుడు క‌మ‌ల్‌.. త‌మిళ వెర్ష‌న్ బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించి విమ‌ర్శ‌ల పాలైన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ విమ‌ర్శ‌లు మ‌రింత‌గా శృతి మించిన నేప‌థ్యంలో క‌మ‌ల్ కూడా ఎదురు దాడికి దిగ‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయాల వైపు దృష్టి సారించిన‌ట్లుగా చెప్పాలి. వ‌చ్చే 7న పార్టీ ప్రారంభించ‌బోతున్న‌ట్లుగా కూడా ఆయ‌న నుంచ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా కూడా... క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం మాత్రం ఖాయ‌మ‌నే చెప్పాలి. మ‌రి క‌మ‌ల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే క్లిక్ అవుతారా?  లేదంటే మ‌న మెగాస్టార్ చిరంజీవి మాదిరి మూన్నాళ్ల‌కే పార్టీని మూసేస్తారా? అన్న కోణంలో ఇప్పుడిప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేస్తోంద‌నే చెప్పాలి. ఈ దిశ‌గా క‌మ‌ల్‌కు షాకిస్తూ... స్వ‌యానా ఆయ‌న‌కు సోద‌రుడైన చారు హాస‌న్ సంచ‌ల‌న జోస్యం చెప్పారు.

అస‌లు క‌మ‌ల్ రాజ‌కీయాల్లో అంత‌గా రాణించ‌లేర‌ని, సీఎం ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డం క‌మ‌ల్ వ‌ల్ల కాద‌ని కూడా చారు హాస‌న్ తేల్చేశారు. ఇప్పుడీ విష‌యం త‌మిళ‌నాట పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర తీసింది. ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చారు హాస‌న్ ఈ విష‌యంపై కాస్తంత న‌ర్మ‌గ‌ర్భంగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  కమలహాసన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, ఆయనకు అధికారం దక్కదని అన్నారు. త‌న సోద‌రుడు క‌మ‌ల్ తో పాటు రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఫేట్‌పైనా చారు హాస‌న్ స్పందించారు. అస‌లు ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోనే రార‌ని తాను అనుకుంటున్న ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక ప్ర‌స్తుత‌మున్న నేత‌ల్లో త‌మిళ సీఎం పీఠాన్ని అధిష్టించే అవ‌కాశం క‌లిగిన నేత‌గా  కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్భుమణి రాందాస్ పేరును చారు హాస‌న్‌ చెప్పారు.
Tags:    

Similar News