కలైంజర్ వారసుడిని ప్రకటించేశారు

Update: 2016-10-20 12:23 GMT
తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. అయితే.. అది అన్నాడీఎంకేకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. అమ్మ ప్రభావంతో.. డీఎంకే అధినేత.. కలైంజర్ గా అందరూ అభిమానంగా పిలుచుకునే డీఎంకే చీఫ్ 92 ఏళ్ల కరుణానిధి తన వారసుడు ఎవరన్నది అధికారికంగా ప్రకటించారు. డీఎంకే పార్టీలో కీలకభూమిక పోషిస్తున్న 62 ఏళ్ల స్టాలిన్ ను కరుణ వారసుడిగా అందరూ అనుకున్నా.. ఇంతకాలం ఆ మాటను అధికారికంగా ప్రకటించటానికి పెద్దాయన ధైర్యం చేయలేదనే చెబుతారు.

ఎందుకంటారా? అక్కడికే వస్తున్నాం. కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి మామూలోడు కాదు. తండ్రి తర్వాత ఆయన వారసుడిగా తానే ఉండాలన్న ఆరాటం ఎక్కువ. అయితే.. అతగాడి చేష్టలు భరించలేనంతగా ఉండటం.. అతడిపై పార్టీలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంటుంది. అలా అని ధైర్యం చేసి తన వారసుడ్ని కరుణ కానీ ప్రకటిస్తే.. ఆళగిరికి పట్టున్న దక్షిణ తమిళనాడులో ఏం కొంప మునుగుతుందన్న భయం అందరిలో ఉంది. అందుకే.. తన వారసుడి గురించి కరుణ ఎప్పుడో డిసైడ్ అయినా.. ఆళగిరి గురించి వెనక్కి తగ్గినట్లుగా చెబుతారు.

అయితే.. గడిచిన కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం.. 92 ఏళ్ల కరుణ మీద ప్రభావం చూపించి ఉంటుందని భావిస్తున్నారు. అందుకే.. ఎలాంటి ఆలస్యం చేయకుండా తన వారసుడ్ని అధికారికంగా ప్రకటించేశారు. అయితే.. తమ అధినేత వారసుడి గురించి పెద్దాయన అధికారికంగా ప్రకటించినప్పటికీ.. సంబరాలు చేసుకునేందుకు స్టాలిన్ వర్గం తటపటాయిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కళైంజర్ ప్రకటనపై ఆయన పెద్దకొడుకు ఆళగిరి ఇంకా స్పందించలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News