వెంక‌య్య‌పై మ‌ళ్లీ ఫైర్ అయిన క‌విత‌

Update: 2016-09-07 16:36 GMT
కేంద్ర‌మంత్రి వెంకయ్యనాయుడుపై స్వ‌ల్ప కాలంల‌లోనే టీఆర్ ఎస్ ఎంపీ కవిత మ‌రోమారు ఫైర్ అయ్యారు. సెప్టెంబ‌ర్ 17ను తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం నిర్వ‌హించాల‌ని వెంక‌య్య డిమాండ్ చేసిన నేపథ్యంలో  కవిత ఆయ‌నపై విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రోమారు ఉద్యోగుల స‌మావేశంలోనూ వెంక‌య్య తీరును త‌ప్పుప‌ట్టారు. బీజేపీ తిరంగాయాత్ర సందర్భంగా వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. తెలంగాణకు అనుకూలంగా 1990లో కాకినాడలో చేసిన తీర్మానాన్నిమర్చిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఏ ఒక్క బీజేపీ నేత పట్టించుకోలేదని మండిప‌డ్డారు. నిజాం హయాం నాటి ఆపరేషన్ పోలోను రాజకీయ స్వార్థం కోసమే వాడుకుంటున్నార‌ని క‌విత విమ‌ర్శించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఏ విధంగా గౌర‌వించాలో త‌మ‌కు తెలుసున‌ని ఎంపీ కవిత పున‌రుద్ఘాటించారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా విమ‌ర్శ‌లు చేయాల‌ని చూస్తేనో లేదా ఇరుకున పెట్టాల‌ని భావిస్తోనే ఆ భ్ర‌మ‌లో ప‌డేలా తెలంగాణ స‌మాజం లేద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని క‌విత పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా తెలంగాణ వచ్చినా ఆంధ్రా కుట్రలు ఇంకా ఆగడం లేద‌ని క‌విత మండిప‌డ్డారు. ఆంధ్రా కుట్రలను ఉద్యోగులు తిప్పికొట్టాలని నిజామాబాద్‌లో టీఎన్జీవో జిల్లాస్థాయి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిన త‌ర్వాత కూడా తాము ఉద్యోగుల‌కు న్యాయం చేయ‌లేక‌పోవ‌డానికి ఆంధ్రా కుట్రలు కార‌ణ‌మ‌ని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులను సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నార‌ని క‌విత‌ ప్ర‌శంసించారు. త్వరలోనే హెల్త్‌కార్డులు అన్ని అస్పత్రుల్లో పనిచేస్తాయని తెలిపారు. ఈ సంద‌ర్భఃగా టీఎన్జీవో భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Tags:    

Similar News