అఖిలేశ్ ఎదుట కేసీఆర్ రాజ‌సం త‌గ్గిందా?

Update: 2018-05-03 04:47 GMT
అన్నా.. మా ప్రెస్ మీట్ స‌రిగా క‌వ‌ర్ కావ‌టం లేద‌న్నా.. ఎక్క‌డో అడుగున వేస్తున్నారు?  మీతో అంత‌సేపు మాట్లాడితే మూడు ముక్క‌ల‌తో ముగించ‌టం అన్యాయ‌మ‌న్నా.. ఇలాంటి మాట‌లెన్నో టీఆర్ ఎస్ నేత‌ల నోటి నుంచి వ‌చ్చేవి. కాకుంటే.. అవ‌న్నీ కొన్నేళ్ల క్రితం. ఇప్పుడంటే సీన్ మొత్తం మారిపోయింది కానీ.. టీఆర్ఎస్ తొలినాళ్ల‌లో త‌మ వార్త‌ల్ని జిల్లాల‌కు ప‌రిమితం చేయ‌కుండా ప్ర‌ధాన సంచిక‌లో క‌నిపించాల‌న్న ఆరాటం టీఆర్ఎస్ నేత‌లు వ్య‌క్తం చేస్తే.. తాను చేసే వ్యాఖ్య‌ల‌కు భారీ ప్ర‌యారిటీ ఇవ్వాల‌న్న మాట‌ను మీడియాకు ప‌దే ప‌దే విన్న‌వించుకునేవారు కేసీఆర్‌.

తెలంగాణ ఉద్య‌మాన్ని మీద‌కెత్తుకొని మోస్తున్న టీఆర్ ఎస్ అధినేత‌ను తెలుగేత‌ర మీడియాకు చెందిన వారు ఇంట‌ర్వ్యూ చేయ‌టానికి వ‌స్తే.. వారికి కేసీఆర్ ద‌ర్శ‌నం.. అపాయింట్ మెంట్ అంత తేలిగ్గా దొరికేది కాదు.  త‌మ మీడియా సంస్థ బ‌లాన్ని.. తాము తీసుకునే ఇంట‌ర్వ్యూను ఏ స్థాయిలో ప్ర‌జెంట్ చేస్తామో క్లారిటీగా చెప్పే వారికి మాత్ర‌మే అప్ప‌ట్లో కేసీఆర్ ఇంట‌ర్వ్యూ దొరికేది. అంతేనా.. ఇంట‌ర్వ్యూ ఎన్ని పేజీల్లో వ‌స్తుందో ప్రింట్ మీడియా విలేక‌రులు ముందే హామీ ఇవ్వాల్సి వ‌చ్చేది. అప్పుడు మాత్ర‌మే మాట్లాడేందుకు ఒప్పుకునేవారు.

తెలంగాణ ఉద్య‌మం ఒక రేంజ్ కి వెళ్లి.. జోరుగా సాగుతున్న వేళ‌.. మీడియాకు చాలానే అప్ర‌క‌టిత ప‌రిమితులు పెట్టేవారు కేసీఆర్‌. త‌మ వార్త‌ల్ని ప‌బ్లిష్ చేసే విష‌యంలో వారు చాలా కేర్ ఫుల్ గా ఉండేవారు. ప్ర‌ధాన మీడియాలో త‌మ వార్త‌ల‌కు ఏ ఒక్క‌రోజు ప్ర‌యారిటీ తగ్గినా.. ఆ విష‌యాన్ని స‌ద‌రు మీడియాకు చెందిన పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లి.. త‌మ‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని వాపోయేవారు. అందుకు ప‌రిహారంగా ప‌క్క రోజునో.. త‌ర్వాత రెండుమూడు రోజుల్లోనో ఏదోలా క‌వ‌ర్ చేస్తామ‌న్న హామీని తీసుకునే వ‌ర‌కూ వ‌దిలిపెట్టేవారు కాద‌ని చెబుతారు.

అలా.. మీడియా విష‌యంలో మొద‌ట్నించి ఒక లెక్క ప్రకార‌మే కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతారు. ఉద్య‌మ స‌మ‌యంలో మీడియాను డీల్ చేసే విష‌యంలో కేసీఆర్ తీరును చూసిన ప‌లువురు.. అలాంటి నేత కానీ అధికార‌ప‌గ్గాలు చేతికి వ‌స్తే.. ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న్న మాట‌ను కొంద‌రు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల నోట వినిపించేది. అందుకు త‌గ్గ‌ట్లే తాజా ప‌రిస్థితులు ఉన్న‌ట్లుగా చెబుతారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా ప్ర‌తినిధుల విష‌యంలో అధికార‌పార్టీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యానికి వ‌స్తే.. చిన్న చిన్న విష‌యాల‌కే మీడియా సంస్థ‌ల అధినేత‌ల వ‌ర‌కూ విష‌యాల్ని తీసుకెళ్ల‌టం ఎక్కువైంద‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్రెస్ మీట్లో స్వేచ్ఛ‌గా ప్ర‌శ్న‌లు అడిగే తీరు విష‌యంలోనూ మీడియా ప్ర‌తినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇరుకున పెట్టేలా ఎవ‌రైనా ప్ర‌శ్న‌లు సంధించిన వెంట‌నే వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టం.. సీరియ‌స్ ఇష్యూను ప‌క్క‌దారి ప‌ట్టించే చిల్ల‌ర అంశాలు మ‌న‌కిప్పుడు అవ‌స‌ర‌మా? అంటూ పెద్ద‌రిక‌పు గ‌ద్దింపుతో ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంలో కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కూ స‌క్స‌స్ అయ్యార‌ని చెబుతారు. అలాంటి ఆయ‌న‌కు ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్లుగా చెబుతారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. ఆయ‌న‌తో క‌లిసి కేసీఆర్ ఉమ్మ‌డి ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్ప‌టివ‌ర‌కూ త‌న ద‌ర్జాకు భంగం వాటిల్ల‌కుండా మీడియా ప్ర‌తినిధుల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయ‌ని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా కాస్త ఇబ్బంది పెట్టేలా ప్ర‌శ్న‌లు ఉండ‌టంతో కేసీఆర్ అస‌హ‌నానికి గురైన‌ట్లు చెబుతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో కాంగ్రెస్ కూడా ఉంటుందా? అంటూ అఖిలేశ్ ను అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్పే విష‌యంలో తెలివిని ప్ర‌ద‌ర్శించినా.. ఆ విష‌యంలో అఖిలేశ్ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేందుకు మీడియా ప్ర‌తినిధులు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల మాదిరి వ్య‌వ‌హ‌రించ‌టం కేసీఆర్ కు సుతారం న‌చ్చ‌లేద‌ని చెబుతారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న హావ‌భావాలు మారిన‌ట్లుగా చెబుతున్నారు. మిగిలిన రోజుల‌కు భిన్నంగా అఖిలేశ్ హైద‌రాబాద్ టూర్ లో మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర తెలంగాణ ముఖ్య‌మంత్రికి చికాకును తెచ్చింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News