అవార్డు వ‌చ్చింద‌ని తెలుసు కానీ అవార్డు ఏందో తెలీదా?

Update: 2018-09-07 05:36 GMT
స‌రిగా దృష్టి సారించ‌టం లేదు కానీ.. కేసీఆర్ మాట‌ల్లో క‌నిపిస్తున్న త‌ప్పులు.. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిలో వ‌స్తున్న తేడా అంత‌కంత‌కూ పెరిగిపోతుంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. ప్ర‌జ‌లు దేనికైనా స‌హిస్తారు కానీ అహంకారాన్ని త‌ట్టుకోలేరు. అధికారం చేతిలో ఉన్నప్పుడు  త‌మ‌కు క‌లిగే కొన్ని న‌ష్టాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని త‌త్త్వం దేశ ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తుంది. అదే స‌మ‌యంలో కొన్ని చిన్న అంశాల్ని చాలా సీరియ‌స్ గా తీసుకోవ‌టం మొద‌ట్నించి ఉన్న‌దే.

అవినీతిని పెద్ద స‌మ‌స్య‌గా భావించ‌ని దేశ ప్ర‌జ‌లు.. అధినేత‌ల్లో అహంకారం..ఆడంబ‌రాన్ని మాత్రం అస్స‌లు త‌ట్టుకోని తీరు క‌నిపిస్తుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిలో అహంభావం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల వేళ‌.. ఈ తీరు ఎంత త‌గ్గితే అంత మంచిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యం త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌టం.. ఆ త‌ర్వాత మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ మీడియా సంస్థ ఎక‌నామిక్స్ టైమ్స్ త‌మ‌కు అవార్డును ప్ర‌క‌టించింద‌ని.. అంతటి పెద్ద సంస్థ త‌మ ప‌నితీరును గుర్తిస్తూ అవార్డును ఇవ్వ‌టాన్ని ఆయ‌న గొప్ప‌గా చెప్పుకున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా.. స‌ద‌రు అవార్డు ఏమిట‌న్న విష‌యాన్ని చెప్ప‌లేని కేసీఆర్‌.. ఏందా అవార్డు? అంటూ అక్క‌డి వారిని అడిగి.. బిజినెస్ రిఫార్మ‌రో.. ఏందో అంటూ చెప్పేశారు. త‌మ‌కు వ‌చ్చిన అవార్డు గొప్ప‌త‌నాన్ని డాబుగా చెప్పుకునే కేసీఆర్‌.. వ‌చ్చింది ఏ అవార్డు అన్న విష‌యాన్ని గుర్తించక‌పోవ‌టం చూసిన‌ప్పుడు.. అవార్డుతో వ‌చ్చే గొప్ప‌లు కావాలే కానీ.. అస‌లు ఆ అవార్డు ఏమిటో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం లేదా? అన్న భావ‌న క‌లుగ‌టం ఖాయం.  ఇలాంటి వైఖ‌రి కేసీఆర్ కు మాత్ర‌మే సొంత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News