కేసీఆర్ మాట‌: ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నారు

Update: 2015-09-09 12:15 GMT
ఓప‌క్క అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు.. మ‌రోవైపు ఉద్యోగుల ఆందోళ‌న‌లు.. మ‌రోవైపు కోర్టు అంశాలు వెర‌సి.. తెలంగాణ‌లో ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే.. చైనాలో ప‌ర్య‌టిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం ప్ర‌పంచ ఆర్థిక వేదిక మీద ఆయ‌న ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా తాము చేసిన ఉద్య‌మం గురించి స్ప‌ష్టంగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌మ‌ది వేర్పాటువాదం కాద‌ని.. కొత్త‌రాష్ట్ర పోరాటం మాత్ర‌మేన‌ని.. ద‌శాబ్దాన్న‌రం మేర ఈ అంశం మీద తాము పోరాడామ‌ని చెప్పుకొచ్చారు. ఉమ్మ‌డి రాష్ట్ర ప్ర‌యోగం విఫ‌ల‌మైంద‌ని.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం కొత్త‌దే అయిన‌ప్ప‌టికీ.. దేశంలోనే అత్యుత్త‌మ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చామ‌న్నారు. త‌న ప్ర‌సంగంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పిన కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీ పాల‌నపై ప్ర‌శంస‌లు కురిపించారు. దేశ ఆర్థిక‌వృద్ధిలో రాష్ట్రాల ప్రాధాన్యం ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌.. ప్ర‌ణాళిక సంఘం స్థానంలో ఏర్పాటు చేసిన నీతిఆయోగ్ టీమిండియాలా ప‌ని చేస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా స‌క్సస్‌ ఫుల్ గా వ్య‌వ‌హ‌రించిన మోడీ.. ప్ర‌ధాన‌మంత్రిగా కూడా త‌న స‌త్తా చాటుతున్నార‌ని చెప్పిన ఆయ‌న‌.. మోడీ నేతృత్వంలో ముఖ్య‌మంత్రులంతా అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల గురించి వివ‌రించిన కేసీఆర్‌.. త‌మ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చే వారి ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తుల్ని కేవ‌లం రెండు వారాల్లోనే ఇస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఇప్ప‌టికి తాము 56 ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇచ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు. మొత్తంగా కొత్త రాష్ట్రంలో త‌మ స‌ర్కారు అభివృద్ధి ప‌థంలో దూసుకెళ్లిన‌ట్లుగా చెప్పిన కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీ పాల‌న‌పై కితాబులు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News