కొత్త ప్లాన్‌ తో కేసీఆర్ టార్గెట్ చేస్తున్నార‌ట‌

Update: 2017-08-23 11:01 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మ‌రో కీల‌క ముంద‌డుగు వేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వివిధ వ‌ర్గాల‌ను త‌న నూత‌న నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ కు పిలిపించి చర్చ‌లు జ‌రిపిన కేసీఆర్ ఇక నుంచి ప్లాన్ మార్చ‌నున్నారట‌. స్వ‌యంగా తానే ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇంత స‌డెన్‌ గా ఎందుకు కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటే టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఆస‌క్తిక‌ర‌మైన రిప్లై ఇస్తున్నాయి. రాజకీయ - వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్‌ - తెలుగుదేశం పార్టీలు దిగజారుతున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలన్న ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణయించుకున్నట్లు అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ రైతు బతుకులు మారాలంటే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించి తీరాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో అవినీతి జ‌రుగుతోంద‌ని, అవ‌క‌త‌వ‌క‌ల‌కు కేంద్రంగా మారింద‌ని పేర్కొంటూ విప‌క్ష కాంగ్రెస్‌ - టీడీపీలు విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఒక‌డుగు ముందుకు వేసి నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో విచార‌ణ జ‌రుపుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుకు విప‌క్షాలు అడ్డుప‌డుతున్న తీరుపై సీఎం కేసీఆర్ మండిప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటనలకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వారందరికీ అందాలన్న లక్ష్యంతో ఈ యాత్ర ఉండ‌నున్న‌ట్లు చెప్తున్న‌ప్ప‌టికీ....ఇటు ప్రభుత్వ కార్య‌క్ర‌మాల ప్ర‌చారం - అటు ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డ‌టం అనే రెండు అజెండాల‌తో కేసీఆర్ ఈ టూర్ మ్యాప్ గీసిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ షెడ్యూల్‌ ను ఖరారు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తేనే తమ బతుకులు మారుతాయని, చెరువులు నిండి బీడువారిన భూముల్లో పంటలు పండుతాయని స‌ర్కారు ముందుకు సాగుతున్న తీరుకు కరీంనగర్ - నిజామాబాద్ - మేడ్చల్ - యాదాద్రి జిల్లాల రైతులు మ‌ద్ద‌తిస్తున్న‌ప్ప‌టికీ విప‌క్షాలు ఆందోళ‌న‌లు చేప‌డుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా, ఆయా జిల్లాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు రైతులు - వృత్తిదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పర్యావరణ అనుమతులివ్వాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
Tags:    

Similar News