భ‌ర‌త్ బ‌హిరంగ స‌భ‌పై కోర్టులో కోదండరాం పిటిష‌న్‌

Update: 2018-04-10 17:35 GMT
ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన ఏదో ఒక వివాదాన్ని మూట‌గ‌ట్టుకుని వ‌స్తోంది.  కానీ క్లీన్ అండ్ జెంటిల్‌మెన్ సినిమాలు తీసే కొర‌టాల శివ అలాంటి ఏ ఆరోప‌ణ‌లు లేకుండా మ‌హేష్ పొలిటిక‌ల్ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఇంత‌వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఏ పాట‌, ఏ డైలాగ్ కూడా కాంట్ర‌వ‌ర్సీకి దారితీయ‌లేదు. అయితే, అనుకోకుండా ఆ సినిమా కోదండ‌రాం నోట్లో నానింది.

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భరత్ అనే నేను ఎల్బీ స్టేడియంలో *భ‌ర‌త్ బ‌హిరంగ స‌భ‌* పేరిట ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. దీనికి మ‌రో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా హాజ‌ర‌య్యారు. రెండ్రోజుల క్రితం ముగిసిన ఈ ఫంక్ష‌ను గురించి కోదండ‌రాం ఎందుకు మాట్లాడాడంటే... అంత‌కు మునుపే ఎల్బీ స్టేడియంలో స‌భ నిర్వ‌హిస్తాన‌ని కోదండ‌రాం కొంత‌కాలం క్రితం ప్ర‌భుత్వ అనుమ‌తి కోరారు. అయితే, దానికి అనుమ‌తి తిర‌స్క‌రించారు. కానీ, దానికి ప్ర‌భుత్వం చెప్పిన కార‌ణం వ‌ల్లే ఇపుడు మ‌హేష్ సినిమా గురించి కోదండ‌రాం మాట్లాడేలా చేసింది.
 
గ‌త నెల 29న తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు ఎల్బీ స్టేడియంలో పోలీసుల అనుమతి నిరాకరించారు. దీంతో కోదండ‌రాం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఎల్బీ స్టేడియం - సరూర్ నగర్ - ఎన్టీఆర్ స్టేడియం - నిజాం కాలేజ్‌ లో ఏదో ఒక చోట...సభకు అనుమతి ఇవ్వడానికి కోరుతూ పిటిషన్ వేశారు. ఈ వాద‌న‌ల్లో వారు ఏమ‌న్నారంటే... ఎల్బీ న‌గ‌ర్‌లో స్టేడియంలో సభ పెడితే.. ట్రాఫిక్ కాలుష్యం పెరుగుతుందని... పోలీసులు చెప్పార‌ని వెల్ల‌డించిన కోదండ‌రాం  మ‌హేష్ బాబు సినిమా స‌భ‌కు వ‌చ్చే వాహ‌నాల వ‌ల్ల ట్రాఫిక్ - కాలుష్యం పెర‌గ‌దా అని సూటిగా ప్ర‌శ్నించారు. నిజానికి ఈ ప్ర‌శ్న‌కు వారి వ‌ద్ద స‌మాధాన‌మూ లేదు గాని... పోలీసులు చెప్పిన కార‌ణం వ‌ల్ల ఇంకో ర‌కంగా భ‌ర‌త్ బ‌హిరంగ స‌భ వార్త‌ల‌కెక్కింది.

కాగా, కోదండారంకు స‌భా స్థ‌లి కేటాయింపుపై సోమ‌వారం న్యాయ‌స్థానం తీర్పు ఇవ్వ‌నుంది.
Tags:    

Similar News