వైఫ‌ల్యాల వేళ‌.. కేటీఆర్ ఇమేజ్ పెంచే ఇన్విటేష‌న్

Update: 2019-05-31 05:10 GMT
ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా త‌గులుతున్న ఎదురుదెబ్బ‌ల‌తో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ లేనంత ఒత్తిడికి గురి అవుతున్న‌ట్లుగా చెప్పాలి. ఈ కార‌ణంతోనే మాట త‌డ‌బ‌డ‌ని వ్య‌క్తి కాస్తా.. మాట‌ల్లో అంద‌రికి దొరికిపోతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెల్ల‌ని కాసు పోలిక‌కు ఎన్నిక‌ల ఫ‌లితాలు పంచ్ ఇస్తే.. గెలుపు గెలుపే కాదు.. ఓట‌మి ఓట‌మి కాదంటూ.. స్వ‌ల్ప మెజార్టీపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తాజాగా అభాసుపాల‌య్యేలా చేశాయి.

ఇలా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఎదుర‌వుతున్న ఎదురుదెబ్బ‌ల వేళ‌.. ఊహించ‌ని రీతిలో కేటీఆర్ ఇమేజ్ పెంచే గుడ్ న్యూస్ ఒక‌టి ఆయ‌న‌కు వ‌చ్చింది. వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వ‌హించే స‌మావేశానికి కేటీఆర్ ను గౌర‌వ అతిథిగా హాజ‌రు కావాల‌న్న ఇన్విటేష‌న్ వ‌చ్చింది.

అక్టోబ‌రు 3-4 తేదీల్లో ఢిల్లీలో జ‌రిగే ఇండియా ఎక‌నామిక్ స‌మ్మిట్ లో నిర్వ‌హించే స‌ద‌స్సులో ఆయ‌న్ను త‌న అనుభ‌వాలు చెప్పాల్సిందిగా కోరుతూ ఆహ్వానం పంపారు. మేకింగ్ టెక్నాల‌జీ వ‌ర్క్స్ ఫ‌ర్ ఆల్ అనే థీమ్ తో సాగే ఈ స‌మావేశంలో..తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్న‌ప్పుడు కేటీఆర్ చేప‌ట్టిన వినూత్న కార్య‌క్ర‌మాలు త‌మ దృష్టిని ఆక‌ర్షించాయ‌ని ఫోరం పేర్కొంది.

ఈ నేప‌థ్యంలో త‌మ స‌ద‌స్సుకు వ‌చ్చి.. త‌న అనుభ‌వాల్ని  షేర్ చేసుకోవాల్సిందిగా కేటీఆర్ ను కోరారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే వ్యాపార‌వేత్త‌లు.. విద్యావేత్త‌లు.. ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌వుతుంటారు.ఒక ప్ర‌తిష్ఠాత్మ‌క స‌ద‌స్సుకు హాజ‌రు కావాల‌ని.. అందులో ప్ర‌సంగించాలంటూ కేటీఆర్ కు ఆహ్వానం రావ‌టం గ‌మ‌నార్హం. త‌న ఇమేజ్ ను పెంచే అవ‌కాశం ఉన్న ఈ స‌ద‌స్సును కేటీఆర్ ఎలా వినియోగించుకుంటారో చూడాలి.
Tags:    

Similar News