లోగుట్టు ఇదేనట: కుప్పం సీఎం సభకు వచ్చినోళ్లంతా వారేనట

Update: 2022-09-24 04:29 GMT
ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంను సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సరే.. ఈసారి ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసే విషయంలో చంద్రబాబు పునారాలోచించుకోవాలన్న రీతిలో జగన్ ఎత్తులు ఉన్నాయి. ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ జగన్ గెలుపు ఖాయమన్న రీతిలో మాటలు చెబుతున్న సీఎం జగన్ అందుకు నాంది ప్రస్తావన కుప్పం అంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. తాను చెప్పే మాటలకు ఏ మాత్రం తగ్గని రీతిలో చేతలు చూపించే పని మొదలు పెట్టారు. మొదటిసారి కుప్పం నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించటం ఒక ఎత్తు అయితే.. దానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేలా చేసిన ఏర్పాట్లు సక్సెస్ అయ్యాయని చెప్పాలి.

జగన్ ఆకాంక్షలకు తగ్గట్లే కుప్పం సభ విజయవంతం కావటంతో ఆ పార్టీ సోషల్ మీడియా విబాగం చెలరేగిపోయింది. ఓపక్క సభకు హాజరైన జన సందోహాన్ని చూపించేందుకు వీలుగా వీడియోల్ని బయటకు రిలీజ్ చేసింది. అదే సమయంలో చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు అవసరమైనన్ని అస్త్రశస్త్రాల్ని క్రమపద్దతిలో బయటకు వదులుతున్నారు. తాజాగా ముగిసిన సీఎం సభను చూసిన తర్వాత.. టీడీపీ నేతలకు సైతం కాస్తంత అనుమానం కలిగేలా ఉండటం జగన్ సాధించిన విజయంగా చెప్పాలి.

తొలిసారి కుప్పం వచ్చిన ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్ర పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేయటమే కాదు.. ఎప్పుడూ .. ఎక్కడా లేని రీతిలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసిన వైనం స్థానికుల్ని.. వాహనదారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రోడ్ల పక్కన.. ఎత్తైన ఇళ్ల పైనా పహరా కాసిన వైనం చూస్తే.. ఇంతటి భారీ ఏర్పాట్లా? అన్న ఆశ్చర్యంతో అందరూ మాట్లాడుకునేలా చేశారు.

ఇంతకూ ఈ సభకు అంత భారీగా జనం ఎలా వచ్చారు? అదెలా సాధ్యమైంది. చంద్రబాబు ఇమేజ్ తగ్గిందా? జగన్ ఇమేజ్ పెరగిందా? లాంటి సందేహాలతో పాటు.. సీఎం చెప్పినట్లుగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పాగా వేయటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయా? అన్నట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. మరి.. అసలేం జరిగిందన్న లోతుల్లోకి వెళ్లి.. సభకు హాజరైన ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? కుప్పం పట్టణానికి సంబంధించిన హాజరు ఎలా ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

కుప్పం సభకు స్థానికంగా ఉన్న వారి కంటే.. కుప్పం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు.. కాస్త దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా భారీగా తరలింపు చేపట్టినట్లుగా చెబుతున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాల్ని తరలించిన వైనం చర్చనీయాంశంగా మారింది. పలమనేరు.. పుంగనూరు.. గంగాధర నెల్లూరు.. పూతలపట్టు.. చిత్తూరు నియోజకవర్గాల నుంచి మాత్రమే కాదు.. అన్నమయ్య తిరుపతిజిల్లాలోని వారిని కూడా తరలించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

ఇంత భారీగా ప్రయత్నాలు చేసిన తర్వాతే అంత భారీ జనసమీకరణ సాధ్యమైందని చెబుతున్నారు. దీనికి తోడు.. నియోజకవర్గాల వారీగా టార్గెట్లు విధించి.. నేతల శక్తి సామర్థ్యాలు.. వారు తరలించే ప్రజల సంఖ్య ఆధారంగా ఉంటుందన్న పెద్దల మాటలు ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న కుప్పం సభకు జన సమీకరణలో కీలక పాత్ర పోషించే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్న భరోసా కూడా కుప్పం సభ కళకళకు కారణమన్న మాట వినిపిస్తోంది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News