యాంటీ కమ్మ... ప్లస్సా...మైనస్సా...?

Update: 2022-04-12 07:30 GMT
నిజానికి కులం గురించి మాట్లాడమైనా, చర్చించడం అయినా ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ రాజకీయ విశ్లేషణలు చేయాలంటే అదీ కూడా ఏపీ లాంటి కులాల  ప్రభావం అత్యధికంగా ఉన్న చోట తప్పనిసరిగా వాటిని  ప్రస్థావించుకుని తీరాల్సిందే. ఇక జగన్ మలి విడత మంత్రి వర్గం కూర్పు ద్వారా చాలా ప్రశ్నలు అటు సమాజంలో ఇటు రాజకీయాల్లో లేవనెత్తేలా చేశారు. సమాజం అంటే అన్ని కులాల సమాహరం. మరి ఆ సమాజానికి రాజకీయ  సేవ చేయాలీ అంటే అన్ని కులాలనూ పక్కన పెట్టుకోవాలి.

కానీ కొన్ని కులాలను అవసరంలేదు అన్నట్లుగా పక్కన పెట్టడం ఒక్క జగన్ కే చెల్లింది అన్న చర్చ ఉంది. ఏపీ రాజకీయాల్లో కమ్మ కులం డామినేటింగ్ రోల్ ప్లే చేస్తోంది. స్వాతంత్రం రాక పూర్వం జస్టిస్ పార్టీలో కూడా ఆ కులం వారు ఆధిపత్యం వహించారు అని చెబుతారు. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత, ఉమ్మడి ఏపీలోనూ కమ్యూనిస్టు పార్టీలలో కమ్మలు నాయకత్వం వహించి కాంగ్రెస్ కి పెను సవాల్ చేశారు. ఆంధ్రాలో తొలి రెండు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటంతగా కమ్యూనిస్టులు ఊపు ఉండేది.

వాటి వెనకాల నాయకత్వం కమ్మలదే అన్నది ఇక్కడ చెప్పుకోవాలి. తరువాత కాలంలో కమ్యూనిస్టులు రెండు పార్టీలుగా విడిపోవడంతో వారి ప్రాభవం తగ్గింది. ఇక అనంతర కాలంలో కాంగ్రెస్ లో కమ్మలు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వచ్చారు. అలా రెండు దశాబ్దాల పాటు రెడ్ల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ లో తమదైన రాజకీయ  వాటా కోసం కమ్మలు గట్టిగానే పోరాడారు.

ఆ టైమ్ లోనే కొత్త పార్టీ పెట్టాలని నాదెండ్ల భాస్కరరావు లాంటి వారికి రావడం, ఆ ఆలోచనలు పసిగట్టిన ఎన్టీయార్ తాను రంగంలోకి దిగడంతో టీడీపీ ఆవిర్భావం జరిగింది. అలా కమ్మలు రాజ్యాధికారం కలను నెరవేర్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా వారు ఉమ్మడి ఏపీని శాసిస్తూ వస్తున్నారు. అలాంటి డామినేటింగ్ కులానికి ఒక్క మంత్రి పదవి  2019లో వైసీపీ ఏలుబడిలో దక్కడమే ఆశ్చర్యం అనుకుంటే 2022లో జరిగిన మలి విడత పునర్ వ్యవస్థీకరణలో ఏకంగా దాన్ని కూడా లేకుండా చేశారు.

దీంతో ఏపీ రాజకీయ చరిత్రలో అయిదు దశాబ్దాల తరువాత కమ్మ మంత్రి లేని తొలి క్యాబినెట్ గా వైసీపీ తాజా మంత్రివర్గం రికార్డు సృష్టించింది. అయితే ఎందుకిలా జరిగింది. దీని వెనక రాజకీయ, సామాజిక సమీకరణలు ఏంటి అంటే కధ చాలానే ఉంది. జగన్ని కమ్మలు 2019 ఎన్నికల్లో ఆదరించారు. అందుకే గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో కూడా వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. కానీ మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ ఎత్తుకోవడంతో వారంతా కేవలం ఆరు నెలల తేడాతోనే దూరం అయ్యారు.

మరి ఈ సంగతి వైసీపీకి ఎలా తెలిసింది అంటే 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనే. ఆ ఎన్నికల్లో కమ్మలు ప్రభావితం చూపించిన చోట వైసీపీ చిత్తు అయింది. అదే టైమ్ లో బీసీలు ఇతర సామాజికవర్గాలు ఉన్న చోట గెలుపు సాధించింది. దీంతో పాటు వైసీపీ సొంత సర్వేలు, ఇతర అధ్యయనాలల్లో చూస్తే కమ్మలు మళ్ళీ టీడీపీ చుట్టూ ర్యాలీ అవుతున్నారు అని తేలుతోంది.

నిజానికి 2019లో కూడా కమ్మలు ఎక్కువగా టీడీపీయే ఓటు చేశారు. కానీ నాడు అసంతృప్తి ఉన్న వారు వైసీపీకి మళ్ళారు. ఇపుడు చూస్తే అంతా మళ్లీ ఒక్కటిగా అయ్యారు. దాంతో 2024 ఎన్నికల్లో వైసీపీకి ఆ సామాజికవర్గం నుంచి పెద్దగా ఓట్లు రాలవు అన్నది కచ్చితమైన అంచనా ఉందని చెబుతున్నారు. అందుకే ఉన్న ఒక్క మంత్రి పదవినీ తీసేసినా బే ఫికర్ అనుకున్నారు అంటున్నారు.

ఇక ఇక్కడ సామాజిక పరంగా చూస్తే కోస్తా జిల్లాలలో కమ్మలకు కాపులకు, కొన్ని చోట్ల బీసీలకు కూడా వైరుధ్యాలు ఉన్నాయి. విజయవాడలో సామాజిక నేపధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎస్సీలు ఇతర బడుగు వర్గాలకు పెద్ద పీట వేయడం ద్వారా తమ ఓటు బ్యాంక్ ని పెంచుకుంటూనే యాంటీ కమ్మ బ్రాండ్ తో లబ్ది పొందాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఆధిపత్య కులాల మీద అణగారిన వర్గాలకు ఉన్న ఒక రకమైన భావననను సొమ్ము చేసుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇప్పటికే జగన్ దిగిపోవాలని సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కమ్మ వర్గం ఆధిపత్యం ఉన్న వారు అంతా గట్టిగా కోరుకుంటున్నారు. వారికో పార్టీ ఉంది. గతంలో ఎలా ఉన్నా ఇపుడు ఆ ఓట్లు అన్నీ కూడా ఏకీకృతం కావాలన్న అజెండా ఉంది.

మరి ఆ ఐక్యతను ధీటుగా మిగిలిన స‌మాజిక వర్గాలను సమీకరించే పనిలోనే మంత్రివర్గం కూర్పు ఉందని అంటున్నారు. జగన్ సైతం ఈ విషయంలో యూపీలో గతంలో మాయావతి ఉపయోగించిన ఫార్ములాను అనుసరించారు అని అంటున్నారు. మాయావతి ఎస్పీని ఢీ కొట్టే క్రమంలో యాదవులను వదిలేసి  యూపీలో ఎస్సీస్, బ్రాహ్మిన్స్ తో ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్ కి తెరతీసి అధికారం అందుకున్నారు.

అపుడు ఎటూ తమకు పడని వర్గాలు, సెక్షన్లను ఆమె దూరం పెట్టారు. ఇక లేటెస్ట్ గా బీజేపీ విషయం చూసుకుంటే యూపీలో మైనారిటీస్ ఎటూ తమకు ఓట్లు వేయరని వారికి సీట్లు ఏవీ కేటాయించలేదు. అలా వారి యాంటీ వర్గాలను దగ్గర చేసుకుని గెలిచింది. ఇపుడు జగన్ సైతం అదే ఫార్ములాను నమ్ముకున్నారు అంటున్నారు. అందుకే బాహాటంగా దాన్ని చెప్పడం ద్వారా మరింత రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారు అని తెలుస్తోంది.

మరి ఈ విషయంలో యాంటీ కమ్మ స్టాండ్ అన్నది వైసీపీకి కలసి వస్తుందా. అలా జరిగితే ఎంతవరకూ అది ప్లస్ అవుతుంది అన్న చర్చ ఒక వైపు ఉంది. మరో వైపు చూస్తే ఇప్పటిదాకా సౌత్ లో లేని ఈ ట్రెండ్ ని క్రియేట్ చేయడం ద్వారా సామాజిక వైషమ్యాలకు తెర తీసినట్లు అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఇంతకాలం ముసుగులో గుద్దులాట లాంటి ఒక విషయాన్ని ఇపుడు వైసీపీ బాహాటం చేసింది. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో 2024 వరకూ ఆగి చూడాల్సిందే.
Tags:    

Similar News