మరో కాంగ్రెస్ నేత మెడకు సారిక హత్య కేసు

Update: 2015-11-20 09:40 GMT
వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో ఇప్పుడు కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా కేసు పడింది. వరంగల్ కు చెందిన ఓ న్యాయవాది ఈ ఘటనపై సీబీఐకి ఫిర్యాదు చేశారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీకి రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే... రాజయ్యకు టిక్కెట్ రాకుండా చేసి ఎలాగైనా అక్కడి టిక్కెట్ పొందాలని మరో మాజీ ఎంపీ ఒకరు ప్రయత్నాలు చేశారు.. స్థానికేతరుడన్న కారణంతో తనకు ఇవ్వకపోయినా తన అల్లుడికైనా ఇవ్వాలని ఆయన అధిష్టానానికి రాయబారాలు పంపారు. అయినా... చివరకు రాజయ్యకే టిక్కెట్ లభించింది.  ఈ నేపథ్యంలో టిక్కెట్ కోసం ప్రయత్నం చేసిన ఆ నేత, మరికొందరిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ అమనగల్‌ కు చెందిన జి నర్సింహ అనే న్యాయవాది హైదరాబాద్‌ లోని సిబిఐ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. రాజయ్య పోటీచేసేందుకు అధిష్టానం అనుమతించిన తర్వాత, నామినేషన్ దాఖలుకు ముందురోజు రాత్రి జరిగిన ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని, దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన ఫిర్యాదు చేశారు. అదేపార్టీ నుంచి వరంగల్ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసిన వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం.  టికెట్ కోసం ప్రయత్నించిన సదరు నేత హస్తం ఈ దారుణంలో ఉండే అవకాశం ఉందని... సిబిఐ రంగంలోకి దిగాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా ఈ కేసు మరో కాంగ్రెస్ నేతపై విచారణకు దారితీస్తుండడంతో కాంగ్రెస్ లో కంగారు మొదలైంది.
Tags:    

Similar News