తెలంగాణ 'లెఫ్ట్' పేలవం..దిద్దుబాటు సిద్ధమైందా?

Update: 2019-11-28 16:07 GMT
వామపక్ష పార్టీలు సీపీఐ - సీపీఎం... దేశంలో ప్రజా సమస్యలపై తమదైన శైలిలో గళం విప్పుతున్న పార్టీలు. అయితే ఇటీవలి కాలంలో అటు జాతీయ స్థాయిలోనే కాకుండా ఇటు ఆయా రాష్ట్రాల్లో కూడా లెఫ్ట్ పార్టీల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీల పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే చెప్పాలి. ఏపీని అలా పక్కనపెడితే... వామపక్షాలకు మంచి పట్టున్న తెలంగాణలో కూడా ఆ రెండు పార్టీలు ఘోరంగా విఫలమవుతున్నాయి. ఈ తరహా పరిస్థితికి కారణాలేంటన్న విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు... తెలంగాణలో తమ శాఖల చీఫ్ లే ఈ దుస్థితికి కారణంగా ఓ అంచనాకు వచ్చాయట. అంతేకాకుండా... ఇప్పటికీ పరిస్థితి చేజారిపోలేదు... మరో అవకాశం ఇస్తాం... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే మాత్రం... పదవుల నుంచి దించేయడం ఖాయమేనంటూ కాస్తంత కరకుగానే హెచ్చరికలు జారీ చేశాయట.

వెరసి సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి - సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లపై ఇప్పుడు ఎన్నడూ లేనంత ఒత్తిడి ఉందట. త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కనీస స్థాయిలో స్థానాలు గెలిపించకుంటే... అటు చాడాతో పాటు ఇటు తమ్మినేని కూడా తమ పదవులను వదులుకోక తప్పదట. ఇదే విషయాన్ని లెఫ్ట్ పార్టీల జాతీయ నాయకత్వం చాడా - తమ్మినేనిలకు నేరుగానే సందేశాలు పంపిందట. దీంతో ఇప్పుడు చాడా - తమ్మినేని... తమ పార్టీలకు ఓ మోస్తరు సీట్లను అయినా గెలిపించక తప్పని పరిస్థితి నెలకొందట. అయితే రెండు వామపక్ష పార్టీలు పెట్టని కోటలుగా ఉన్న నల్లగొండ - ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు కకావికలమైన నేపథ్యంలో చాడా - తమ్మినేనిలు తమ జాతీయ నాయకత్వం ఆశలకు అనుగుణంగా ఫలితాలు సాధిస్తారా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

వాస్తవంగా ఖమ్మం - నల్లగొండ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వామ పక్షాలకు బలమైన ఓటు బ్యాంకే ఉండేది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ రెండు పార్టీలకు శాసనసభలో కనీసం ఒక్క ఎమ్మెల్యే అయినా ఉండేవారు. సీపీఐ కన్నా సీపీఎం పలుమార్లు నలుగురు - ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎంపీ సీట్లను కూడా ఈ పార్టీలు గెలుచుకున్నాయి. అయితే ఇటీవలి కాలంలో అసెంబ్లీలో గానీ - పార్లమెంటులో గానీ ఈ రెండు పార్టీలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. 2014 ఎన్నికల్లో ఒకరిద్దరు గెలిచినా... ఆ తర్వాత వారు టీఆర్ ఎస్ లో చేరిపోవడంతో రెండు పార్టీలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత మిగిలిన జిల్లాల మాట ఎలా ఉన్నా ఖమ్మం - నల్లగొండ జిల్లాల్లో కూడా ఈ పార్టీలు పట్టు కోల్పోయాయి. మరి మునిసిపల్ ఎన్నికల్లో అయినా ఈ పార్టీలు సత్తా చాటుతాయో... లేదంటే  చాడా, తమ్మినేని పదవులకు రాజీనామా చేయక తప్పదో చూడాలి.
Tags:    

Similar News