బాబు కేరాఫ్ కుప్పం... ?

Update: 2021-12-09 03:30 GMT
మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబుకు తత్వం బోధపడింది. అంతే కాదు తనకు ముఖ స్తుతులు చేస్తూ క్యాడర్ చల్లగా కాలం గడిపేస్తోంది అని కూడా తెలిసివస్తోంది.  తన చుట్టే తిరుగుతూ పార్టీలో అంతా  బాగుందని చెబుతున్నారని కూడా అర్ధం చేసుకున్నారు. చంద్రబాబు ఇలా అవగాహన చేసుకోవడం వెనక చాలానే కధ ఉంది. ఏపీలో టీడీపీ ఎపుడూ ఓడిపోలేదా అంటే ఓడింది. అలాగే 2019 ఎన్నికల్లో ఓడినా కూడా చంద్రబాబుకు అసలు నిజాలు తెలిసి రాలేదు. ఇక లోకల్ బాడీస్ లో ఓడినా కూడా అంతా అధికార పార్టీ దారుణం దాష్టికం అని ఆయన ఏ రకమైనా సమీక్షా చేయకుండానే విమర్శలు చేస్తూ వచ్చారు.

అదే తమ్ముళ్లకు కూడా అవకాశంగా మారింది. నిజానికి చంద్రబాబు గత రెండున్నరేళ్లలో ఎపుడూ సంపూర్ణ సమీక్ష చేసినది అయితే లేదు అనే చెప్పాలి. ఎంతసేపూ అధికార పాటీ దౌర్జన్యాలు చేస్తూ పోతోంది, మనకు బలం ఉన్నా ఓడిస్తోంది అని తాను అనుకున్నారు, క్యాడర్ కి అదే చెప్పారు. అయితే ఇపుడు పుట్టె పూర్తిగా మునిగింది. ఏకంగా అధినాయకుడు మూడు దశాబ్దాలుగా అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తున్న కుప్పంలోనే బొమ్మ తిరగబడింది. చంద్రబాబుకే ఇబ్బందిని కలిగిందే ఓటమిని కుప్పంలో తెచ్చారు.

మొదట్లో ఇక్కడ కూడా వైసీపీ దౌర్జన్యాల ఖాతాలో వేశారు. అయితే తెలుగుదేశం అనుకూల మీడియా సైతం అక్కడ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేసి వాస్తవాలను కొన్నాళ్ల తరువాత అయినా తెలియచేసింది. ఇక చంద్రబాబుకు కూడా కొంచెం లోతులకు వెళ్ళి సమీక్ష చేస్తే చాలా విషయాలు తెలిసాయి. అధికార పార్టీ దాష్టికాలు ఎపుడూ ఉండేవే. లోకల్ బాడీ ఎన్నికలు అంటే ఎవరు పవర్ లో ఉంటే వారికే అడ్వాంటేజ్ గా ఉంటాయి. అయితే దానికి తోడు అన్నట్లుగా క్యాడర్ కూడా చేతులెత్తేస్తేనే దారుణమైన ఫలితాలు వస్తున్నాయని బాబుకు కుప్పం సాక్షిగా అవగతం అయింది.

అందుకే కుప్పం మునిసిపాలిటీ ఓటమికి దారి తీసిన పరిస్థితుల మీద ఆయన నిజాయతీగా  సమీక్ష చేస్తూ గట్టిగానే మాట్లాడారు, సంచలన కామెంట్స్ కూడా చేశారు. నన్ను పొగుడుతూ కూర్చోవద్దు. జనాల్లోకి వెళ్ళి పని చేయండి అంటూ బాబు గట్టిగానే క్లాస్ పీకారు. అంతే కాదు, పనిచేసే వారికే గుర్తింపు అని స్పష్టంగా ప్రకటించారు. ఇక తాను తరచూ కుప్పంలో పర్యటిస్తాను అని కూడా బాబు పేర్కొన్నారు. అక్కడ సొంత ఇల్లు కూడా నిర్మించుకుని ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఒక్క కుప్పం టీడీపీకి మిగిలిన ఎన్నో డౌట్లు తీర్చేసింది. నేనెందుకు ఓడాను, టీడీపీని జనాలు ఎందుకు తిరస్కరించారు అంటూ 2019 ఎన్నికల ఫలితాల నుంచి బాబుని మధిస్తూ వచ్చిన ప్రశ్నలకు ఇన్నాళ్ళకు కుప్పం రూపంలో జవాబు దొరికిందనే అనుకోవాలి. ఇదే తీరున బాబు ఆత్మ సాక్షిగా సమీక్షలు చేసుకుని ముందుకు వెళ్తే అవే  టీడీపీ భవితకు శ్రీరామ రక్షంగా ఉంటాయనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News