మోడీ అశ్రద్ధతోనే గాంధీ మనమడి మరణం?

Update: 2016-11-08 09:14 GMT
చావు తన మీద నింద పెట్టుకోదని పెద్దోళ్లు చెబుతుంటారు. అందుకు తగ్గట్లే ప్రతి మరణవార్త వెనుక ఒక ‘కారణం’ కనిపిస్తుంటుంది. ఈ తత్వానికి తగ్గట్లే తాజాగా జాతిపిత మహాత్మా గాంధీ మనమడి మరణ వార్త విన్న వెంటనే ప్రధాని మోడీ మదిలో మెదలటం ఖాయం. భావోద్వేగ ప్రసంగాలకు పెట్టింది పేరు అయిన మోడీ.. తనకు మైలేజీ కలిగించే ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. అలాంటి ఆయన గాంధీ మనమడి విషయాన్ని ఎందుకంత నిర్లక్ష్యంగా వదిలేశారో అర్థం కాని పరిస్థితి.

సర్దార్ పటేల్ కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి చైనాలో భారీ విగ్రహాన్ని తయారు చేయిస్తున్న మోడీ సర్కారు.. గాంధీ మనమడికి నాణ్యమైన వైద్యాన్ని అందించే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం కాదు. నాసాలో శాస్త్రవేత్తగా పని చేసి.. తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తిపాస్తుల్ని అందరికి పంచేసిన ఆయన.. భార్యతో సహా భారత్ కు తిరిగి వచ్చేసి.. వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీసిన పరిస్థితి. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. వైద్యం కోసం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.

ఈ పరిస్థితులు మీడియాలో వచ్చిన పిమ్మట రియాక్ట్ అయిన మోడీ.. గాంధీ మనమడికి సాయం అందిస్తామని చెప్పారు. మాట అయితే ఇచ్చారు కానీ అదెందుకో అమలు కాలేదు. మోడీ సర్కారు నిర్లక్ష్యం గాంధీ మనమడు రాందాస్ గాంధీ ఆరోగ్యాన్ని మరింత విషమించేలా చేసింది. చిన్నతనంలోనే గాంధీ వెంట ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఆయన మ‌ర‌ణ వార్త‌..  స్వేచ్ఛా భారతంలోని దినపత్రికల్లో సింగిల్ కాలమ్ దాటని పరిస్థితి. 87 ఏళ్ల వయసులో సూరత్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. గతనెల 22న కానూ గాంధీ గుండెపోటుకు గురయ్యారు. అనంతరం బ్రెయిన్ హెమరేజ్ కారణంగా శరీరం సగం చచ్చుపడిపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా మీద పడుతున్న అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు.

చిన్నతనం నుంచి బ్రిటీష్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సంపాదించాలని తపించిన ఆయన.. స్వతంత్ర‌ భారతంలో ఎవరూ పట్టించుకోని పరిస్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించిన దుస్థితి. విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఏ బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ కోసం పోరాడారో.. అదే బ్రిటీష్ ప్రధానితో మన ప్రధాని మోడీ మాట్లాడుతున్న వేళ.. గాంధీ మనమడి ఆఖరి శ్వాస ఆగిపోయింది. ఒకవేళ.. ఆయన అనారోగ్యంపై దేశ ప్రధాని కానీ సీరియస్ గా స్పందించి ఉంటే.. ఆయన మరికొంత కాలం బతికేవారేమో? మరిప్పుడు చెప్పండి గాంధీ మనమడి మరణం.. ఎవరి నిర్లక్ష్యంతో జరిగిందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News