బతికే ఉన్నానంటున్న ఫైర్ బ్రాండ్ సీఎం

Update: 2016-03-25 16:05 GMT
దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నా.. కొందరు తమదైన శైలిలో దూసుకెళుతుంటారు. నిజానికి అలాంటి వారికి ప్రత్యామ్నాయం ఉండదు కూడా. అలాంటి కోవలోకే వస్తారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. పేరులోనే ‘‘మమత’’ కానీ.. రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో ఫైర్ బ్రాండ్ తో చెలరేగిపోతుంటారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం షాక్ తినేలా ఆమె కాన్ఫిడెన్స్ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రోజునే.. పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన దమ్ము.. ధైర్యం ఎవరికైనా ఉందంటే అది మమతమ్మకే సాధ్యమేమో.

అలాంటి ఆమె.. తన క్యాడర్ లో ఉత్సాహాన్ని పొంగి పొర్లే వ్యాఖ్యల్ని తాజాగా చేశారు. నాలుగేళ్ల వ్యవధిలో 400 ఏళ్ల పనులు చేసిన ఘనత తమ సొంతంగా  చెప్పుకున్న మమత.. ఎన్నికల్లో తమ ప్రత్యర్థుల ప్రభావం ఏ మాత్రం ఉండదన్న పూర్తి నమ్మకంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు భయపడేదే లేదని.. తానింకా బతికే ఉన్నానని.. తాను ఉన్నంత వకూ పోరాడుతూనే ఉంటానని చెప్పిన ఆమె.. పార్టీ నేతలు.. కార్యకర్తలు హుషారుగా ఎన్నికల్లో దూసుకెళ్లాలంటూ ఉత్సాహపరిచారు.

మామూలుగానే దూసుకెళ్లే మమతమ్మ బ్యాచ్ ను ఆమె.. మరింత ఉత్సాహపరిస్తే ఇంకెంత చెలరేగిపోతారో అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు.. మూడు రోజుల్లో తోక ముడిచి పోతారని వ్యాఖ్యానించారు. బీజేపీ.. కాంగ్రెస్.. సీపీఎం పార్టీలు చేసే ప్రచారాల్ని అస్సలు పట్టించుకోవద్దని దూసుకెళ్లాలంటూ ఉత్సాహపరుస్తున్నారు. మామూలుగా చెలరేగిపోయే మమతమ్మ బ్యాచ్.. ఆమె నోటి వెంట వచ్చే ఇలాంటి మాటలతో మరెంతగా చెలరేగిపోతారో..?
Tags:    

Similar News