ఇంత దారుణ ప‌రిస్థితి ఎవ‌రికీ వ‌ద్దు బ్రో!

Update: 2022-12-08 00:34 GMT
పేద‌రికం స‌హ‌జ‌మే. దేశంలో ధ‌ర‌ల‌తో స‌మాంతరంగా పేద‌రికం పెరుగుతున్న మాట కూడా వాస్త‌వ‌మే. అయితే.. మ‌రీఇంత పేద‌రికం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క‌నీ వినీ ఎరుగ‌రు. అంతేకాదు.. ఎవ‌రికీ ఇలాంటి ప‌రిస్థితి కూడా రాకూడ‌ద‌ని కోరుకుంటారు. ఏం జ‌రిగిందంటే.. అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి తీసుకువెళ్లిన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని యలందూరు పట్టణంలో జరిగింది.

మండ్య జిల్లాకు చెందిన రవి, అతడి భార్య కలమ్మ కొంతకాలంగా యలందూరు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం సమీపంలోని చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. వీళ్లద్దరూ ప్లాస్టిక్‌ వస్తువులను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు రోజుల అనారోగ్యంతో కలమ్మ(26) మృతి చెందింది. ఆమెను కోల్పోయిన బాధలో ఉన్న భర్త రవికి.. అంత్యక్రియలకు డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియలేదు. ఎందుకంటే..చేతిలో చిల్లిగ‌వ్వలేదు. నా అనేవారు అంత‌క‌న్నా లేరు. దీంతో అత‌ని ప‌రిస్థితి దారుణంగా మారింది.

అయినా, క‌ళ్ల ముందు క‌ట్టుకున్న భార్య విగ‌త‌జీవిగా ప‌డి ఉంది. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి? ఎవ‌రు మాత్రం సాయం చేస్తారు క‌నుక అనుకున్న ఆ భ‌ర్త‌.. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ మృతదేహాన్ని భుజాలపై వేసుకుని అంతిమ సంస్కారాల కోసం పట్టణంలోని సువర్ణవతి నది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. అయితే, ఆ నోటా ఈ నోటా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న రాష్ట్రంలో క‌నీసం పేద‌ల విష‌యాన్ని ప‌ట్టించుకునే తీరిక ప్ర‌భుత్వానికి లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రికొంద‌రు.. మాట‌లు కాదు.. చేత‌ల్లో చూపిద్దాం.. అంటూ సామాజిక పిలుపునిస్తున్నారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న ద‌క్షిణాది రాష్ట్రాల్లోని వారి బాగానే క‌దిలించింది. మరి సాయం అందుతుందో సానుభూతికే ప‌రిమితం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News