వైసీపీ ఎంపీకి లేడీ ఎమ్మెల్యే వార్నింగ్‌...!

Update: 2019-10-03 12:02 GMT
ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌లు అయ్యిందో ?  లేదో ? ఆ పార్టీలోనే ఒక‌రి పొడంటే మ‌రొక‌రికి అస్స‌లు గిట్ట‌డం లేదు. ఒక‌రికి ఒక‌రు వార్నింగ్‌లు ఇచ్చుకోవ‌డ‌మో ?  లేదా ?  ఒక‌రిపై ఒక‌రు సీఎం జ‌గ‌న్‌ కు ఫిర్యాదు చేసుకోవ‌డ‌మో చేస్తున్నారు. రెండు రోజుల క్రితం క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే అర్థ‌ర్‌ - నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి జ‌గ‌న్‌ కు ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకున్నారు. ఇక తాజాగా గుంటూరు జిల్లాలో పార్టీలోనే జ‌రుగుతున్న గ‌లాటాలు పార్టీ ప‌రువును బ‌జారు పాల్జేస్తున్నాయి.

జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన చిల‌క‌లూరిపేట‌లో ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి పార్టీ సీనియ‌ర్ నేత - రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందే పార్టీలో చేరి సీటు ద‌క్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచిన ర‌జ‌నీ ఇప్పుడు రాజ‌శేఖ‌ర్‌ ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా త‌న వ‌ర్గం బ‌లోపేతం చేసుకునే ప‌నిలో బిజీ అయ్యారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ రాజ‌శేఖ‌ర్‌ కు ఎమ్మెల్సీ - మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్నా అది ఇంకా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇక న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు మాత్రం సీనియ‌ర్ నేత‌గా ఉన్న మ‌ర్రిని క‌లుపుకునే వెళుతున్నారు. ఇది ర‌జ‌నీకి న‌చ్చ‌డం లేదు. ఇటీవ‌ల ర‌జ‌నీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు బీసీ అస్త్రం తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చారు. బీసీ మ‌హిళ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో త‌మ‌ను సొంత పార్టీ నేత‌లే ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రెస్‌ మీట్లు పెట్టారు.

తాజాగా జ‌రిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ర‌జ‌నీ సొంత పార్టీ నేత‌ల మీద చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. తాను మాజీ మంత్రితో అయితే ఎంత ఎర‌కైనా యుద్ధం చేస్తాన‌ని... అయితే సొంతపార్టీలోని నేత‌లే కొందరు నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.... నా వెంటే ఉండి వెన్నుపోటు పొడవాలని చూసేవారి అంతు చూస్తాను.. ఇది నా నైజం అని కూడా ఆమె ఓపెన్‌ గానే వార్నింగ్ ఇచ్చారు.

ర‌జ‌నీ ఇచ్చిన ఈ వార్నింగ్ అటు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ తో పాటు త‌న‌కు చెప్ప‌కుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తోన్న త‌మ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయుల‌కే అన్న చ‌ర్చ‌లు ఆ పార్టీ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా దూకుడుగా ముందుకు వెళుతోన్న ర‌జ‌నీకి పార్టీలోనే కొంద‌రు మంత్రుల అండ‌దండ‌లు ఉన్నాయ‌ని... అందుకే ఆమె త్వ‌ర‌లోనే అటు రాజ‌శేఖ‌ర్‌ తో పాటు ఇటు లావుపై జ‌గ‌న్‌ కు ఫిర్యాదు చేస్తుంద‌ని కూడా పేట రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా పేట వైసీపీ వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేదు.


Tags:    

Similar News