అనుచరుల అత్యుత్సాహం.. చిక్కుల్లో ఎమ్మెల్యే రజిని

Update: 2021-10-14 16:30 GMT
ఏ చిన్న  పనిచేసిన దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం కామన్. అదే పబ్లిసిటీ ఊరకే వస్తే ఇంకేముందు.. కాగల కార్యం గంధ్వరులు నెరవేర్చినట్లు గంతులేస్తాం. ఈ ప్రచారాన్ని చూసి ముచ్చటపడుతుంటారు. పబ్లిసిటీకి నేతలకు ఎంత విడదీయరాని సంబంధముందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ గురించి ప్రచారం చేసుకోవడం వల్ల అటు ప్రజల్లో ఇటు అధినేత మ‌న‌సుకు కూడా ద‌గ్గ‌ర‌వుతామ‌నే న‌మ్మ‌కం రాజ‌కీయ నేత‌ల్లో ఉంటుంది. అది శృతి మించితే అభాసుపాలవుతుంటారు. ఇలాగే గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని చిక్కుల్లో పడ్డారు. చిలకలూరి పేట పోలేరమ్మ ఉత్సవాల్లో తొమ్మిది అవతారాల్లో అమ్మవారి ఫొటోలను ఫ్లెక్సీగా పెట్టారు. అయితే అమ్మవారిలో తమ ప్రియతమ నేతను చూసుకోవాలని అభిమానులు ముచ్చటపడ్డారు. అమ్మవారి పక్కనే ఎమ్మెల్యే ఫొటో పెట్టారు. ఈ అత్యుత్సాహం ఇప్పుడు వివాదమైంది.

పోలేరమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్యే రజినిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమెకు అనుచరులు ఘనస్వాగతం పలికాలని అనుకున్నారు. ఆ అభిమానం పరిమితులు దాటింది.  అభిమానులు చేసిన పనికి ఆమె ఆపదలో పడ్డారు. అమ్మవారి పక్కన ఎమ్మెల్యే ఫొటో పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం ఇప్పుడు గుంటూరు జిల్లా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలయ అధికారులు ఎమ్మెల్యే ఉన్న ఫ్లెక్సీని తొలగించారు. వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహంపై విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపడుతోంది.

ఏపీ కేబినేట్ విస్తరణ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ దృష్టిని ఆకర్షించేందుకు నేతలు ఆరాటపడుతున్నారు. ఈ సందర్భంలోనే రజని, సీఎం జగన్ దృష్టిలో పడేందుకు సోషల్ మీడియాను సాధనంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే  ఆమె తన సోషల్ మీడియా టీమ్‌ను సిద్ధం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధితోపాటు సీఎం ప్రారంభించిన ఏ అభివృద్ది కార్య‌క్ర‌మైనా త‌న పేరుతో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తుంటారనే విమర్శలున్నాయి. ఇదే విషయంపై పార్టీలోని కొందరు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలో జగన్ పాదయాత్ర సమయంలో ఏ స్థాయిలో జగన్‌ను ప్రచారం చేశారో అంతే స్థాయిలో రజని తనను కూడా సోషల్ మీడియాతో ప్రచారం చేసుకున్నారనే విమర్శలున్నాయి.

రజని టీడీపీలో ఉన్న‌ప్పుడు ఆ పార్టీ అధినే చంద్రబాబును విపరీతంగా పోడ‌గ‌్తలతో ముంచెత్తి వార్తల్లో నిలిచేవారని జిల్లా వాసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. వైసీపీ ప్రభంజనంలో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టి నుంచి ఆమె సోష‌ల్ మీడియాలో చేసుకునే ప్ర‌మోష‌న్లు చాలా సార్లు చ‌ర్చ‌కు దారితీశాయి.  సోష‌ల్ మీడియాలో త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News