ఎలానంటే?: వార్ లేకున్నా పాక్ తాట తీయొచ్చు

Update: 2016-09-28 04:48 GMT
ముఖాముఖి వెళ్లి ముష్టిఘాతాలు విసిరి.. పైకి లేవకుండా చేస్తేనే శత్రువుపైన అధిక్యత సంపాదించినట్లు కాదు. పట్టు పడితే.. ఆ దెబ్బకు విలవిలలాడాలి. వీళ్లతో ఎందుకు పెట్టుకున్నాం రా భగవంతుడా అని అనుకోవాలి. ఇప్పటివరకూ అలా చేయకపోవటంతోనే దాయాది పాకిస్థాన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ మెతగ్గా ఉండే భారత ప్రధాన మంత్రుల్ని మాత్రమే చూసిన పాకిస్థాన్... మోడీ లాంటి మొండోడ్ని డీల్ చేయలేదు. ఎప్పటిలానే ఇష్టారాజ్యంగా వ్యవహరించినా.. నాలుగు మాటలు అనేయటం తప్ప భారత్ ఏమీ చేయలేదని ఫీలైన పాక్ కు ఇప్పుడు ఊహించని షాక్ లు తగులుతున్నాయి.

యుద్ధం అంటే బజారున పడి కొట్టుకోవటమే అనుకున్న పాక్‌ కు.. మోడీ మార్క్ రణనీతి పగలే చుక్కలు చూపిస్తున్న పరిస్థితి. పాక్ ఆయువుపట్టుకు కారణమైన అంశాల మీద ఫోకస్ చేసిన మోడీ.. ఒక్కొక్క ఆయుధాన్ని బయటకు తీస్తూ.. దాయాదికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. ఉరీ ఉగ్ర ఘటనతో 19 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకొని భారత్ సహనానికి పరీక్ష పెట్టిన పాక్ కు.. తిరిగి నాలుగు గట్టి దెబ్బలు తగిలితే తప్ప దారికి రాదన్న విషయం స్పష్టమైంది. పాక్ ను యుద్ధంతో దెబ్బ తీసే బదులు దాని ఆయువుపట్టుపై దెబ్బ తీసేలా ప్లాన్ చేశారు ప్రధాని మోడీ.

రక్తం.. నీరూ కలిసి ఒకేసారి ప్రవహించవన్న సంచలన వ్యాఖ్య వెనుక ఎంత అర్థముందన్న విషయాన్ని గ్రహించటం మొదలెట్టిన పాక్ ఇప్పుడు వణికిపోతోంది. కీలకమైన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్ ను ఈడుస్తామంటూ పాక్ ప్ర‌ధానికి విదేశాంగ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు మాటలు చెబుతున్నా.. ఆచరణలో ఇదేమీ అంత ఈజీ వ్యవహారం కాకపోవటం గమనార్హం. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాల్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకోవటమే కాదు.. పాకిస్థాన్ నోట మాట రాకుండా చేసే వీలుంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే సంకేతాల్ని మోడీ సర్కారు పంపింది.

ఇలాంటి నిర్ణయాన్ని అసలేమాత్రం ఊహించని పాకిస్థాన్ ఇప్పుడు విలవిలలాడుతోంది. ఎందుకంటే.. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన సమయంలోనూ సింధు జలాల పంపిణీ వ్యవహారం మామూలుగా సాగిపోయింది. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా మోడీ వ్యవహరించటం పాక్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది. తాము పాడిందే పాట.. ఆడిందే ఆట అన్నట్లుగా ఇంతకాలం వ్యవహరించిన పాక్ కు.. బుద్ధి చెప్పేలా మోడీ వ్యవహరించటం పాక్ కు ఎటూ పాలుపోవటం లేదు. అందుకే.. అంతర్జాతీయ కోర్టుకు భారత్ ను ఈడుస్తామంటూ పాక్ మాటలు చెబుతోంది.అదంతా సాధ్యమేనా? అన్నది చూస్తే.. అదేమీ అంత తేలిక కాదన్న విషయం అర్థమవుతుంది. అంతేకాదు.. ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకోలేరన్న పాక్ మాటలు ఉత్తవేనని నిపుణులు చెబుతున్నారు.

సింధు జలాల విషయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఏదైనా వివాదం ఏర్పడితే రెండు దేశాలు మూడు దశల్లో ఆ వివాదాల్ని పరిష్కరించుకోవచ్చు.  ఇరు దేశాలు రెండేళ్ల పాటు వివాదం మీద సంప్రదింపులు జరుపుకోవటం.. అప్పటికి పరిష్కారం కుదరకపోతే ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన నిపుణులు సమస్య‌ను పరిష్కరించే ప్రయత్నం చేయటం.. ఇదీ సాధ్యం కాకపోతే ఇరు వర్గాలు యూఎన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించటం. అంటే.. కోర్టుకు వెళ్లాలంటే ముందు రెండు అంశాలు పూర్తి కావాలి. అయితే.. ఇక్కడే మరో కీలకమైన పాయింట్ ఉంది. అదే పాక్ కు మెడకు ఉరితాడుగా మారిందని చెప్పొచ్చు.

ఇరు దేశాల మధ్య రెండేళ్ల పాటు జరగాల్సిన చర్చల్లో ఏదైనా ఒక దేశం చర్చలకు ముందుకు రాకపోతే.. మిగిలిన రెండు దశలకు వెళ్లే అవకాశం అవతలి దేశం కోల్పోతుంది. అంటే.. సమావేశానికి భారత్ నో అంటే.. పాకిస్థాన్ రెండు.. మూడు దశలకు వెళ్లటం సాధ్యం కాదు. అదే జరిగినప్పుడు పాక్ చెబుతున్నట్లుగా భారత్ ను అంత‌ర్జాతీయ‌ కోర్టుకు ఈడుస్తామని చెప్పే మాటలన్నీ బెదింపు ధోరణే తప్పించి.. లీగల్ గా ఆ అవకాశమే లేదు. పాక్ తాట తీసేందుకు ఉపయోగపడే ఈ పాయింట్ ను భారత్ ఇప్పుడు అస్త్రంగా వాడుతోంది. పాక్ ప్ర‌ధాని స‌ల‌హాదారు సర్తాజ్ అజీజ్ నీటి అంశంపై చర్చకు భారత్ ను ఆహ్వానించినా.. అందుకు భారత్ నో చెప్పేసింది. అంటే.. ఒప్పందానికి నో అనే పనిని భారత్ షురూ చేసిందన్న మాట. ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని పాక్ ఇప్పుడు విలవిలలాడుతోంది.

సింధుజలాల ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశలో భారత్ పయనిస్తుందన్న సంకేతాలు ఇచ్చి పాక్ కు ఇప్పటికే షాక్ ఇచ్చిన భారత్.. మరిన్ని చర్యలు చేపడితే.. దాయాది ఊపిరి ఆడక విలవిలలాడుతుందని చెబుతున్నారు. జీలం – చినాబ్ నదులను కలుపుతూ ఉండే తుల్ బుల్ ప్రాజెక్టును పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు పని కాని పూర్తి అయిన పక్షంలో జీలం నదీ జలాలపై భారత్ పట్టు సాధించటంతో పాటు.. పాక్ వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెడుతుంది. అంతే కాదు.. జీలం నదీ జలాలపై పట్టు సాధించటంతో పాటు.. పాక్ - పాక్ ఆక్రమిత కశ్మీర్ లలో వరద ముప్పు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరో కీలకాంశం ఏమిటంటే.. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం.. రావి - బియాస్ - సట్లెజ్ నదుల నీటి సంపదను భారత్ ఎంతైనా వాడుకునే వీలుంది. ఈ పాయింట్ ను పరిగణలోకి తీసుకొని.. నీటిని అపరిమితంగా వాడేసుకుంటే.. పాక్ నీటి కొరతతో విలవిలలాడటం ఖాయం. ఇలా ఒక దాని తర్వాత మరొకటి చొప్పున షాకుల మీద షాకులు ఇచ్చే వ్యవహారాల్ని తెరపైకి తీసుకొస్తున్న మోడీ తీరుతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే పాక్ పీక నొక్కే ఇలాంటి అంశాల్ని ఇప్పటికే తెరపైకి తెచ్చి అమలు చేసి ఉంటే.. దాయాది ఎప్పుడో దారికి వచ్చేదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News