మోడీ టూర్ ఏమో కానీ.. ఆ టీ మంత్రికి టెన్షన్.. టెన్షన్

Update: 2022-05-26 07:30 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా మారింది ఒక తెలంగాణ రాష్ట్ర మంత్రి వారి ఇష్యూ. స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ టూర్ ఏమో కానీ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మాత్రం మహా టెన్షన్ పుట్టిస్తోందట. ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నందుకు మామూలుగా అయితే ఆయన అస్సలు పట్టించుకునే వారే కాదు. ఎందుకంటే.. ఆ ఇష్యూ తమ బిగ్ బాస్ ది కాబట్టి.. ఆయన చూసుకుంటారు. కానీ.. ఇప్పుడాయన ఇంట్లో కుమార్తె పెళ్లి ఈరోజేనే కావటంతో ఆయన తెగ ఇబ్బంది పడిపోతున్నారు.

నేతల ఇంట్లో జరిగే పెళ్లిళ్లు ఎంత భారీగా.. మరెంత వేడుకగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటిది తన చిన్న కుమార్తె శ్రీహర్షిత పెళ్లి వేడుకను ఈ రోజు (గురువారం) రాత్రి 9.08 గంటలకు హైటెక్స్ లో నిర్వహిస్తున్నారు. సాధారణంగా పార్టీ నేతల పెళ్లిళ్లకు.. వారింట్లో జరిగే శుభకార్యాలకు పెద్దగా వెళ్లని సీఎం కేసీఆర్.. మంత్రులు.. ముఖ్యనేతల ఇంట్లో జరిగే వివాహ వేడుకలకు మాత్రం తప్పనిసరిగా హాజరవుతుంటారు.

మామూలుగా అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో జరిగే పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిస్ అయ్యే అవకాశమే లేదు. కానీ.. మోడీ హైదరాబాద్ పర్యటన పుణ్యమా అని.. గులాబీ బాస్ బెంగళూరుకు వెళ్లటం తెలిసిందే. మోడీ ఇలా వస్తుంటే.. తాను అలా బెంగళూరు వెళ్లటం బాగానే ఉన్నా.. ఆయన అలా హైదరాబాద్ నుంచి వెళ్లినంతనే.. తాను హైదరాబాద్ కు ఇలా వచ్చేస్తేనే బాగోదన్న భావనతో ఉన్నట్లు చెబుతారు.

`అదే జరిగితే.. తన కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్ మిస్ కావటం ఖాయం. ఇప్పటికే దావోస్ లోని సదస్సు కారణంగా మంత్రి కేటీఆర్ మిస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు కూడా పెళ్లికి వచ్చే విషయంలో సందేహం ఉందంటున్నారు.

అయితే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్నిహితుల వాదన ప్రకారం.. సీఎం కేసీఆర్ తప్పక హైదరాబాద్ కు రావటం ఖాయమన్న మాటను చెబుతున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో జరిగే పెళ్లికి రాకుండా ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

అయితే.. ఆయన రాకకు సంబంధించిన కన్ఫ్యూజన్ మాత్రం నడుస్తోంది. ఏది ఏమైనా.. రాత్రి అయ్యేసరికి హైదరాబాద్ కు రావటం ఖాయమని మంత్రి వర్గీయులు చెబుతుంటే.. బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్.. అందరూ అనుకుంటున్నట్లుగా హైదరాబాద్ కు వచ్చి.. తన శిష్యుడి ఇంట్లో జరుగుతున్న పెళ్లికి హాజరవుతారా? ఇదేమీ లేకుండా తన దారిన తాను తన షెడ్యూల్ కు అనుగుణంగా వెళ్లిపోతారా? అన్నది ప్రశ్నగామారింది. ఈ కారణంతోనే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు టెన్షన్ తెప్పిస్తోందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News