త‌మ్ముడి గాలి తీసేసినా ములాయం సింగ్‌

Update: 2017-05-07 06:32 GMT
ఉత్తరప్రదేశ్ రాజ‌కీయాల్లో కీల‌క పార్టీ అయిన సమాజ్‌ వాది పార్టీలో కుటుంబ రాజ‌కీయాలు మ‌ళ్లీ ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందుకు నెలకొన్న సంక్షోభం ర‌చ్చ‌రచ్చ‌గా మారి ఎన్నికల సమయంలో కొంత చల్లబడ్డ‌ట్లు కనిపించిన విష‌యం తెలిసిందే. అయితే మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కార‌ణంగా మ‌ళ్లీ ర‌చ్చకెక్కుతున్నాయి. ఎన్నికల తర్వాత తాను కొత్త పార్టీ పెడతానని ప్రకటించినట్టుగానే ములాయంసింగ్ సోదరుడైన శివ‌పాల్ కొత్త పార్టీ ప్రారంభించారు. సమాజ్‌ వాదీ సెక్యులర్‌ మోర్చా పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన శివపాల్ - పార్టీ చీఫ్‌ గా ములాయం సింగ్ యాద‌వ్‌ ఉంటారని కూడా పేర్కొన్నారు.

అన్న‌కుమారుడికి వ్య‌తిరేకంగా సొంత పార్టీ ప్ర‌క‌టించి శివ‌పాల్ సంచ‌ల‌నం సృష్టిస్తే యూపీ మాజీ సీఎం ములాయంసింగ్ యాద‌వ్ ఈ ట్విస్ట్‌ కు మ‌రో ప‌రిణామం జోడించారు. తమ్ముడు శివపాల్ యాదవ్ కొత్త పార్టీ ప్రకటించడంపై స్పందించిన ములాయంసింగ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త పార్టీ గురించి శివపాల్‌ తనతో చర్చించలేదని పేర్కొన్నారు. ఈ విష‌యంపై శివ‌పాల్‌ తో మాట్లాడతానని తెలిపారు. వారం రోజులుగా తనను శివ‌పాల్ కలవలేదని, కొత్త పార్టీ గురించి తనతో చర్చించలేదన్నారు. సోదరుడు శివపాల్‌ తో తాను ఎల్లప్పుడూ నిలబడతానని ప్ర‌క‌టించారు. ``ఎన్నికల కంటే ముందే శివపాల్ కొంత నొచ్చుకున్నాడు. నా కుమారుడు అఖిలేష్ యాదవ్ ఎందుకు అతనిని ఇష్టపడడంలేదో నాకు తెలియదు. పార్టీకి ఇబ్బందులు తలెత్తిన సమయంలోనూ శివపాల్ ఎదుర్కొని నిలబడ్డాడు`` అని ప్ర‌శంసించారు. సమాజ్‌ వాదీ పార్టీలో చీలిక‌లు రావాల‌ని మాత్రం కోరుకోవడం లేదని తేల్చిచెప్పారు. ములాయం-సమాజ్‌ వాదీ పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు. త‌ద్వారా త‌మ్ముడితో క‌లిసి ప‌య‌నించే కంటే కుమారుడైన అఖిలేష్‌తో ముందుకు సాగ‌డ‌మే మేల‌ని తేల్చేసుకున్న‌ట్లు ములాయం ప‌రోక్ష ప్ర‌క‌ట‌న చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News