ఏపీలో బీజేపీ...లాలీపాప్ లో పుల్ల ఒకటే

Update: 2017-12-19 10:09 GMT
గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు తెలుగు రాష్ర్టాల్లో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తున్నాయి. ఇటు ఏపీలో, అటు తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌బోతున్నామ‌ని బీజేపీ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ష‌రామామూలుగా ఊహించిన‌వే అయిన‌ప్ప‌టికీ... అయితే ఏపీలో ప్ర‌భుత్వంలో భాగమైన బీజేపీ గురించి తెలుగుదేశం పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు కొత్త ర‌చ్చకు తెర‌తీస్తున్నాయి. తాజాగా ఓ టీవీ చాన‌ల్ చ‌ర్చ‌లో టీడీపీ నాయకురాలు ముళ్లపూడి రేణుక ఏపీలో బీజేపీ లాలీపాప్‌లో పుల్ల లాంటిద‌ని ఎద్దేవా చేశారు. ఈ ప‌రిణామంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అంతే ఘాటుగా రియాక్ట‌య్యారు.

ఓ టీవీ చాన‌ల్ చ‌ర్చ‌లో పాల్గొన్న ముళ్ల‌పూడి రేణుక గుజ‌రాత్ ఫ‌లితాల సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ గెలుపుతో ఇక‌నుంచి పొత్తులో భాగంగా తాము సీట్లు యాచించే ప‌రిస్థితి లేద‌ని...ఇన్ని సీట్లు ఇవ్వాల్సిందేన‌ని శాసించే స్థితికి చేరామ‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై రేణుక ఘాటుగా స్పందించారు. ఏపీలో బీజేపీ ప‌రిస్థితి లాలీపాప్‌లో పుల్ల వంటిద‌ని ఎద్దేవా చేసిన ఆమె...ఆ పుల్ల ఉన్నా  ఒక‌టే...లేకున్నా ఒక‌టే అంటూ...బీజేపీతో త‌మ‌కు ప్ర‌త్యేకంగా క‌లిగే ప్ర‌యోజ‌నం ఏం లేద‌ని తేల్చేశారు.

టీడీపీ నాయ‌కురాలు రేణుక వ్యాఖ్య‌లు మీడియాలో వైర‌ల్ అవ‌డంతో ఎమ్మెల్సీ వీర్రాజు మ‌ళ్లీ రియాక్ట‌య్యారు. తాము లాలీపాప్‌ లు - ఐస్‌ క్రీం పుల్లలమంటూ మాట్లాడడం సరికాదన్నారు. అంత ప‌నికిరాని వార‌యినప్పుడు బీజేపీతో పొత్తు ఉండ‌ద‌ని ఆ పార్టీ నేత చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించాల‌ని అన్నారు. త‌మ‌పై టీడీపీ నేత బాబు రాజేంద్ర్ర‌ప్రసాద్ వంటివారు త‌ర‌చుగా కామెంట్లు చేయ‌డం...ఆ మ‌రుస‌టి రోజు చంద్ర‌బాబు వాటిని ఖండించ‌డం, అదుపులో ఉండాల‌ని చెప్ప‌డం ఓ ప్ర‌హ‌స‌నం అయిపోయిందే..త‌ప్ప ఎలాంటి మార్పు లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా చంద్రబాబు ఎంతో ఆదరించామని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు. మిత్రపక్షంతో ప్రతిసారీ బీజేపీ మోసపోతోందన్నారు. కార్యకర్తలకు ఒక్క పింఛను - ఒక్క ఇళ్లు ఇప్పించుకోలేక పోయామన్నారు. 2004లో చంద్రబాబుతో ఎన్నికలకు వెళ్లి మేము ఓడిపోయాం అని పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా...మ‌రోమారు పార్టీ నేత‌ల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రించిన‌ట్లు టీడీపీ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మాల్దీవుల విహార‌యాత్ర‌లో ఉన్న చంద్ర‌బాబు పేరుతో విడుద‌ల‌యిన ఆ ప్ర‌క‌ట‌న‌లో మిత్రపక్షమైన బీజేపీపై ఎవరూ విమర్శలు చేయకూడదని సీఎం చంద్రబాబు తెలిపారని ఉంది. పార్టీ అనుమతి లేకుండా బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయరాదని నేతలను హెచ్చరించారని తెలిపారు భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఏదైనాసరే పార్టీ అనుమతితోనే మాట్లాడాలని పార్టీ అధినేత స్ప‌ష్టం చేశార‌ని పేర్కొంది.
Tags:    

Similar News