నందికొట్కూరు.. వివాదం పెరుగుతుందా... త‌రుగుతుందా...?

Update: 2021-07-19 17:30 GMT
క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ రాజ‌కీయాలు అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఆర్థ‌ర్‌.. వ‌ర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొన్న విష‌యం తెలిసిందే. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆర్థ‌ర్ గెలుపున‌కు ఎంతో కృషి చేశారు. అయితే.. త‌ర్వాత‌.. కాలంలో ఇద్దరి మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగింది.  ఎమ్మెల్యేగా ఆర్థ‌ర్ గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి.

అంతేకాదు సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తన అనుచరులకు టికెట్లు ఇవ్వట్లేదని బైరెడ్డి, ఆర్థర్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న విష‌యం కూడా తెలిసిందే. దీనిపై అనేక మార్లు పంచాయితీలు కూడా జ‌రిగాయి. ఏకంగా కర్నూలు జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సర్ది చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఆర్థ‌ర్‌, బైరెడ్డిలు ఇద్ద‌రూ కూడా చెరోవ‌ర్గంగా మారిపోయి.. ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటున్నారు. పైగా ఆర్థ‌ర్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వేరే వాళ్ల పెత్త‌నం ఏంట‌ని ఫైర్ అయ్యారు. చివ‌ర‌కు ఈ విష‌యం సీఎం వ‌ర‌కు వెళ్లింది.

జ‌గ‌న్ సైతం ఈ వివాదాన్ని సెటిల్ చేసే బాధ్య‌త‌ల‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డికి అప్ప‌గించారు. దీంతో స‌జ్జ‌ల అనిల్ కుమార్ యాద‌వ్ తో పాటు మ‌రో సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు నందికొట్కూరు వివాదం స‌రి చేయ‌మ‌ని చెప్పారు. ఈ మంత్రులు ఎంత స‌ర్దిచెప్పినా ఆర్థ‌ర్‌, బైరెడ్డి ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక‌, ఇప్పుడు జ‌రిగిన కీల‌క ప‌రిణామంతో.. ఈ వివాదం మ‌రింతగా ముదిరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
తాజాగా జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కాల్లో..  బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్  కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా సిద్ధార్థ్‌ను నియ‌మించారు. రాష్ట్ర‌స్థాయిలో దీనికి మంచి పేరు కూడా ఉంది. మంచి ప‌వ‌ర్స్ నిధులు కూడా బాగానే ఉంటాయి.

ఇక బైరెడ్డి వ‌ర్గం సంబ‌రాలు మామూలుగా లేవు. పైగా బై రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉండ‌డంతో అభినంద‌న‌లు మామూలుగా లేవు. దీంతో ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. సిద్ధార్థ్‌కు జ‌గ‌న్ మంచి గుర్తింపే ఇచ్చిన‌ట్ట‌యింది. అయితే.. ఈ ప‌రిణామం.. నియోజ‌క‌వ‌ర్గంపైనా ప‌డుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ స‌హా.. బైరెడ్డి వ‌ర్గాలు జోరుగా వివాదాలు రాజేసుకుంటున్న క్ర‌మంలో జ‌గ‌న్ బైరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని ఆర్థ‌ర్ ఎలా అర్ధం చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News