జగన్ మీద జాతీయ పార్టీల యుద్ధం... ?

Update: 2021-10-05 11:30 GMT
జగన్ ఏపీలో ఎదురులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన రెండున్నరేళ్ల పాలనను సాఫీగా పూర్తి చేసినట్లుగానే చెప్పాలి. ఎక్కడా అయనకు ఎదురు నిలిచే విపక్షం కానీ సణుగుతూ గొణిగే స్వపక్షం కానీ అసలు లేనే లేవు. జగన్ ఏమనుకుంటే అదే జరిగింది. ఆయన పాలన నల్లేరు మీద నడకలా సాగిపోయింది. కరోనా లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టాయేమో కానీ ప్రతిపక్షాల నుంచి పెద్దగా ప్రతిఘటన లేదనే విశ్లేషించాలి. ఇదిలా ఉంటే జగన్ సొంత ఇలాకా కడప జిల్లా బద్వేల్ లో ఇపుడు ఉప ఎన్నిక జరగనుంది. నిజానికి ఇక్కడ గెలుపు ఎవరికి అంటే రాజకీయం ఆ మాత్రం తెలిసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. పైగా ఈ ఏడాదే లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ అద్భుత ఫలితాలు సాధించింది. దాంతో తక్కువ వ్యవధిలో జరిగే ఈ ఉప ఎన్నిక మీద ఎవరికీ ఎటువంటి ఆశలు అయితే లేవు.

దాంతో జనసేన టీడీపీ సానుభూతి సాకుతో తెలివిగా బరిలో నుంచి తప్పుకున్నాయి. అదే సమయంలో తాము పోటీలో ఉంటామని చెప్పి బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. దానికి సోము వీర్రాజు చెప్పిన లాజిక్ ఏంటి ఏంటే కుటుంబ పాలనను తాము వ్యతిరేకిస్తామని, వారసత్వ రాజకీయాలకు దూరమని అన్నారు. దాంతో బీజేపీ అక్కడ చేయడం అనివార్యమైంది. మరో వైపు చూస్తే కాంగ్రెస్ కూడా తాము పోటీకి రెడీ అంటోంది. ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ శైలజానాధ్ అయితే తాము బద్వేల్ లో బస్తీమే సవాల్ చేస్తామని అన్నారు. దీంతో ఇపుడు బద్వేల్ లో ఏకగ్రీవం కాదు, ఎన్నిక కచ్చితంగా జరగ‌నుంది.

జగన్ సొంత జిల్లాలో జరిగే ఈ ఉప ఎన్నికల మీద అందరి దృష్టి ఉంది. దాంతో ప్రాంతీయ పార్టీలైన జనసేన, టీడీపీ తప్పుకున్నా జాతీయ పార్టీలు రెండు మాత్రం రేసులో ఉండడం విశేషమే. ఒక విధంగా జగన్ తో ఇది జాతీయ పార్టీలు చేసే సిసలైన యుద్ధంగా చూడాలి. మొత్తానికి సాఫీగా ఏకగ్రీవం అవుతుంది అనుకున్న బద్వేల్ ఉప ఎన్నిక కాస్త పోరుగా మారుతోంది. ఇది వైసీపీకి టెన్షన్ పెట్టేది కాకపోయినా అనవసర తలనొప్పిగా ఉంటుంది అన్నది మాత్రం నిజం. ఈ పోరులో నిలిచి గెలిచి లక్ష మెజారిటీ సాధించాలన్న జగన్ ఆదేశాలతో క్యాడర్ మాత్రం ఇపుడు టెన్షన్ పడుతోంది.




Tags:    

Similar News