పాలిటిక్స్ అంటే స్ట్రాటజీ కాదు పీకే సార్...!

Update: 2022-10-04 17:15 GMT
రాజకీయాలు తనకు ఉగ్గుపాలతోనే వంటబట్టిన పాఠమని ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే అనబడే రాజకీయ వ్యూహకర్త బలంగా నమ్ముతారు. తానే ప్రధానులను ముఖ్యమంత్రులను గద్దె మీద నిలుపుతాను అని కూడా గాఢంగా విశ్వసిస్తారు. తన దయ ఉంటే ఎవరైనా ఉన్నతాశనం ఎక్కాల్సిందే అన్నది ఆయన గట్టి ధీమా. నరేంద్ర మోడీని ఒకసారి గుజరాత్ సీఎం గా మరోసారి ఏకంగా దేశానికి ప్రధానిగా చేసిన ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుని ఆ మీదట బీహార్ లో నితీష్ ని ఏపీలో జగన్ని, తమిళనాట స్టాలిన్ని, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని సీఎం లుగా చేశానని చెప్పుకుంటున్న పీకే అతి విశ్వాసంతో  తానే రాజకీయ అవతారం ఎత్తేశారు.

సీన్ కట్ చేస్తే ఆయనకు పాలిటిక్స్ లో చుక్కలు కనిపిస్తున్నారు. ఇంతకీ ఎవరీ పీకే అని ఆయన సొంత రాష్ట్ర బీహార్ లోనే అనుకుంటున్నారంటే పేకే అనవసరంగా రాజకీయ అవతారం ఎత్తారనే అనుకోవాలేమో. ఆయన గాంధీ జయంతి వేళ తన రాజకీయ ప్రస్థానానికి టీజర్ లాంటి పాదయాత్రను మొదలెట్టారు. గట్టిగా రెండు రోజులు నడిచినా జనం వెనకాల లేరు. ఇక ఒక బహిరంగ సభ పెడితే రెండు వందల మంది కూడా పోగు కాలేదు. దాంతో పీకేకు పొలిటికల్ షాక్ మామూలుగా కొట్టలేదు.

తనను తాము ఆకాశమంత ఎత్తున ఊహించేసుకుని దేశానికే దిక్సూచిగా భావించుకునే పీకే ఇపుడు నేల చూపులు చూస్తున్నారు అని అంటున్నారు. పీకేకు ఇప్పటికైనా అర్ధమైందో లేదో కానీ రాజకీయాలు వేరు, వ్యూహాలు వేరు. ఒక డైరెక్టర్ సినిమా సూపర్ హిట్ గా తీశానని, అంతా తనవల్లే అనుకుని సూపర్ స్టార్ హీరోను మార్చేసి తానే హీరోగా వస్తే అదే బొమ్మ ఫల్టీ కొడుతుంది. ఇది కూడా అంతే. ఇక్కడ పీకే పీఎంలను సీఎంలను చేశానని చెప్పుకుంటున్న వారు ఎవరూ ఆషామాషీ నేతలు అయితే కారు.

వారికి అంటూ జనంలో చరిష్మా ఉంది. వారి అంటే పడి చచ్చే జనమూ వెనకాల చాలా ఉంది. వారికి ప్రత్యేకంగా ఓటు బ్యాంక్ దిట్టంగా ఉంది. ఆ మీదట వారికి గెలుపు పిలుపు కోసం ఏమైనా కొన్ని సూచనలు తీసుకోవాలన్నపుడు పీకే లాంటి వారి వ్యూహాలు పనిచేశాయి. అంటే వారి విజయాల వెనక తొంబై అయిదు శాతానికి పైగా క్రెడిట్ వారిదైతే ఆ అయిదు శాతమే పీకే వ్యూహాలది అనుకోవాలి. లేకపోతే పీకే వారితో జత కట్టకముందు కూడా వారు క్రౌడ్ పుల్లర్సే. సీట్లూ ఓట్లూ తెచ్చుకున్న వారే. కాకపోతే వారికి అధికారం అందడానికి కొన్ని రకాల టిప్స్ మాత్రమే పీకే ఇచ్చారు.

కానీ అదేదో తన ప్రతిభా పాటవమే అని పీకే మిడిసిపడిపోయారని అంటున్నారు. దాంతో ఎందుకు తానే సీఎం  పీఎం కాకూడదన్న ఆలోచనతో ఆయన పార్టీ పెట్టే దిశగా సన్నాహాలు చేసుకుని ఇపుడు పాదయాత్ర అంటూ జనం బాట పడితే మొర వినేందుకు ఎదురుగా ప్రజానీకమేరీ. మొత్తానికి పీకే రాజకీయ సినిమా టీజర్ అయితే సూపర్ ఫ్లాప్  అయిందనే అంటున్నారు.

ఇక్కడ అందరికీ కలిగే ఒక పెద్ద డౌట్ ఏంటి అంటే పీకే లాంటి తల పండిన వ్యూహకర్త తన బలహీనతను ఇంత తేలికగా రాజకీయ జనాల ఎదుట  ఎలా బయటపెట్టేసుకున్నారూ అని. పీకే గుప్పెట మూసి ఉంచి తానే బలాఢ్యున్ని అని కేవలం వ్యూహకర్తగా ఉండిపోతే ఆ మ్యాజిక్ లో పడి ఇంకెంతమంది రాజకీయ నాయకులు ఆయన్ని ఆశ్రయించేవారో.

కానీ అత్యాశో లేక అతి ధీమావో కానీ పీకే వేసిన పొలిటికల్ స్టెప్స్ ఇపుడు ఆయన్ని  ఏమీ కాకుండా చేశాయా అన్న చర్చ అయితే ఉంది మరి  అయినా స్ట్రాటజీలకే కేరాఫ్ అయిన పీకే ఇపుడు దీనికి కూడా కొత్త వ్యూహం ఏదో ఒకటి పన్ని తన రాజకీయ సినిమా హిట్ కోసం ఏ రకమైన దారులు వెతుకుతారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News