టెన్ష‌న్ పీక్స్ కు వెళ్లే మాట చెప్పిన ఉత్త‌ర‌కొరియా

Update: 2017-05-02 09:22 GMT
మాట‌లు ఎంత‌లా మంట‌లు పుట్టిస్తాయో..ఉద్రిక్త‌త‌ల్ని అంత‌కంత‌కూ ఎంత‌లా పెంచుతాయో తాజాగా ఉత్త‌ర‌కొరియా మాట‌ల్ని వింటే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఇటీవ‌ల కాలంలో బాధ్య‌త‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి.. మూర్ఖంగా మాట్లాడేస్తున్న ఉత్త‌ర‌కొరియా.. తాజాగా అదే త‌ర‌హాలో అగ్ర‌రాజ్యానికి మ‌రో స‌వాల్‌ను విసిరింది.

అణ్వాయుధ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో ఉత్త‌ర‌కొరియాకు.. అమెరికాకు మ‌ధ్య సంబంధాలు అంతగా బాగుండ‌ని సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అగ్ర‌రాజ్యాన్ని రెచ్చ‌గొట్టే త‌ర‌హాలో ఉత్త‌ర‌కొరియా స‌వాలు విసిరింది. ఏ క్ష‌ణంలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా అణ్వాయుధ ప‌రీక్ష నిర్వ‌హిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చేసింది. దీంతో.. కొరియా ద్వాపంలో ఉద్రిక్త‌త‌లు పీక్స్‌ కు చేరుకున్నాయి.

స‌దూర లక్ష్యాల్ని ఢీకొట్టే సామ‌ర్థ్యం ఉన్న క్షిఫ‌ణిని ప్ర‌యోగిస్తామ‌ని.. ఆరోద‌ఫా అణ్వాయుధ ప‌రీక్ష‌లు చేప‌డ‌తామ‌ని ఉత్త‌ర‌కొరియా చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేప‌గా.. మ‌రోసారి కానీ ప‌రీక్ష‌లు జ‌రిపితే దాడులు త‌ప్ప‌వంటూ అమెరికా హెచ్చ‌రించింది. అయిన‌ప్ప‌టికీ ఉత్త‌ర‌కొరియా ఇప్ప‌టికి వెన‌క్కి తగ్గంది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కొరియా విదేశాంగ అధికార ప్ర‌తినిధి ఒక‌రు మాట్లాడుతూ.. దేశ నాయ‌క‌త్వం నిర్ణ‌యించిన ప్ర‌కారం ఏక్ష‌ణంలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా అణ్వాయుధ ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా అమెరికాకు చురుకుపుట్టే మాట‌ల్ని కొరియా విదేశాంగ అధికార‌ప్ర‌తినిధి ప్ర‌స్తావించారు. అమెరికా త‌న అణ్వ‌స్త్ర విధానాల్ని మానుకునేంత‌వ‌ర‌కూ తాను అణ్వాయుధ ప‌రీక్ష‌ల్ని చేప‌డ‌తామ‌ని పేర్కొన‌టం కొత్త టెన్ష‌న్‌కు తెర తీసేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News