చలికాలం మరింత తీవ్రం.. కరోనా చావులు భారీగా పెరుగుతాయట!

Update: 2020-10-24 13:00 GMT
కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతున్న వేళ.. మరో పిడుగు లాంటి వార్త కలవర పెడుతోంది. రానున్న చలికాలంలో కరోనా మరింత తీవ్రంగా విజృంభిస్తుందని.. మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరగొచ్చని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాలో 2021 ఫిబ్రవరి నాటికి ఒకటిన్నర లక్షలకు పైగా ప్రజలు కరోనాతో చనిపోయే అవకాశం ఉందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ అంచనా వేసింది.

ప్రజలంతా మాస్కుల ధరించి సోషల్​ డిస్టెన్స్​ పాటిస్తే కరోనా కేసులు కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో పాటు మెరుగైన చికిత్స కూడా లేదు. దీంతో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ లో చలిగాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇన్​స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ డైరెక్టర్ క్రిస్ ముర్రే ఒక ప్రకటనలో తెలిపారు.

దేశంలో తాజా పరిస్థితి కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గిపోతుంది అనడానికి ఎలాంటి నమ్మకాన్ని కలిగించడం లేదని ఆయన పేర్కొన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి జనాభా అత్యధికంగా కలిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అధిక స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

డిసెంబర్ చివరిలో, జనవరిలో రోజు వారి మరణాల స్థాయి పెరుగుతుందని ముర్రే పేర్కొన్నారు. అయితే ప్రజలందరూ మాస్కులు ధరించడం ద్వారా మరణాల రేటు తగ్గించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాజా కరోనావైరస్ ప్రభావాన్ని బట్టి, వ్యాప్తిని బట్టి ఫిబ్రవరి 1 నాటికి 386,000 మరణాలను నమోదు చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మాస్కులు ధరించాలని వైద్యలు చెబుతున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ కూడా మాస్కులు ధరించకుండానే ప్రచారసభలకు హాజరవుతున్నాడు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
Tags:    

Similar News