సినిమాలలో పవర్ స్టార్ అంటారు. బహుశా అభిమానుల్లో ఉన్న క్రేజు కావచ్చు. ఆ అభిమానులు ఆయనను *ట్రెండ్ సెట్టర్* అంటూ గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇపుడు అదే పదంతో పవన్ కళ్యాణ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఉద్దానం సమస్యను పరిష్కరించాలని తన మాజీ పార్టనర్ చంద్రబాబుకు 48 గంటలు డెడ్‌లైన్ విధించారు పవన్ కళ్యాణ్. పరిష్కారం కనుక్కోకపోతే యాత్ర ఆపేసి తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలు విచిత్రంగా ఉన్నాయి. జనసేన చర్యలు విమర్శల పాలవుతున్నాయి.
ఇంతకీ జనసేన చేసిన ప్రకటనలో ఏముందంటే... *ఉద్దానం కిడ్నీ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రస్తుతం తాను బసచేసిన ఎచ్చెర్ల డాట్లా రిసార్ట్స్‌లోనే శుక్రవారం సాయంత్రం నుంచి ఆయన దీక్షలో కూర్చున్నారు. 24 గంటలపాటు ఈ దీక్ష కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవన్ ప్రజల మధ్యే దీక్ష చేస్తారని* పార్టీ పేర్కొంది.
ఇక ఈ మధ్యే పుస్తకాలు చదివి జర్నలిస్టులకు పాఠాలు చెప్పిన పవన్ తాజాగా యాత్రలో పుస్తకాలు మోసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇపుడు దీక్షంటూ కాలి మీద కాలేసుకుని పచ్చటి గడ్డిలో పవన్ పుస్తకాలు చదువుతుంటే... అదేదో సినిమా షూటింగ్ జరుగుతున్న బిల్డప్ తప్పించి ఏ కోశానా ప్రజా పోరాటంలా లేదని పలువురు విమర్శిస్తున్నారు.