శ్ర‌వ‌ణ్ ముచ్చ‌ట ఇన్నాళ్ల‌కు ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌!

Update: 2018-08-10 06:50 GMT
కొన్ని సంద‌ర్భాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పే మాట‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఆస‌క్తిక‌ర‌మైన మాట‌ను చెప్పారాయ‌న‌. ప్ర‌స్తుతం ప్ర‌జా పోరాట యాత్ర పేరిట గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న భీమ‌వ‌రంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కులం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాల‌కు తాను ఎంత వ్య‌తిరేక‌మో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జారాజ్యంలో తాము చేసిన ఒక ప్ర‌యోగాన్ని చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండి.. టీఆర్ ఎస్ అధినేత క‌మ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై అదే ప‌నిగా విరుచుకుప‌డే శ్ర‌వ‌ణ్ ముచ్చ‌ట‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. ప్ర‌జారాజ్యంలో ప‌వ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా ఉండే వారిలో శ్ర‌వ‌ణ్ పేరును చెబుతారు.

2009 ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ లోక్ స‌భ స్థానానికి శ్ర‌వ‌ణ్ కు టికెట్ ఇవ్వాలంటూ ప‌వ‌న్ ప‌ట్టుబ‌ట్ట‌టంతో ఇచ్చిన‌ట్లు చెబుతారు. అంతేకాదు.. శ్ర‌వ‌ణ్ గెలుపు కోసం ప‌వ‌న్ త‌న సొంత డ‌బ్బును ఖ‌ర్చు చేశార‌న్న మాట అప్ప‌ట్లో వినిపించింది. ఆ త‌ర్వాతి కాలంలో ప్ర‌జారాజ్యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీఆర్ ఎస్ లో చేర‌టం.. ఆపై కాంగ్రెస్‌ లో చేర‌టం జ‌రిగిపోయాయి.

శ్ర‌వ‌ణ్ గురించి ప‌వ‌న్ చెప్పిన మాట‌ల్ని ఆయ‌న మాట‌ల్లోనే చ‌దివితే మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. సికింద్రాబాద్ లోక్ స‌భ స్థానానికి ప్ర‌జారాజ్యం టికెట్ ను దాసోజ్ శ్ర‌వ‌ణ్ కు టికెట్ ఇచ్చి ఒక ప్ర‌యోగం చేశాం. ఎందుకంటే.. దాసోజు శ్ర‌వ‌ణ్ విశ్వ‌బ్రాహ్మ‌ణ కులానికి చెందిన వ్య‌క్తి. ఆయ‌న కులానికి చెందిన ఓట్లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా త‌క్కువ‌. అయినా.. అదేమీ ఆలోచించ‌కుండానే టికెట్ ఇచ్చాం. ఆ ఎన్నిక‌ల్లో శ్ర‌వ‌ణ్ కు వ‌చ్చిన ఓట్లు 1.38ల‌క్ష‌లు.

త‌ర్వాతి కాలంలో ప్ర‌జారాజ్యం నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లారు శ్ర‌వ‌ణ్. అయితే.. ఆయ‌న కులం ఓట్లు ఎక్కువ‌గా లేవ‌న్న కార‌ణంగా ఆయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు. తెలంగాణ ఉద్య‌మంలో నిజాయితీగా ప‌ని చేసిన నేత‌ల్లో శ్ర‌వ‌ణ్ ఒక‌రు. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ ల‌భించ‌క‌పోవ‌టంతో త‌ర్వాతి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో చేరారు. ప్ర‌జ‌లు ఎప్పుడూ కులాన్ని ఆధారంగా చేసుకొని ఓటు వేయ‌ర‌ని.. అందుకు సికింద్రాబాద్ లోక్ స‌భ బ‌రిలో ఉన్న‌ప్పుడు శ్ర‌వ‌ణ్ కు ల‌భించిన ఓట్లే కార‌ణమ‌న్నారు.

ప్ర‌జారాజ్యం పార్టీ చేసిన ప్ర‌యోగాల గురించి ప‌వ‌న్ ఇంకా గుర్తు పెట్టుకోవ‌టం మంచిదే. అయితే.. ప్ర‌జారాజ్యం టికెట్ కోసం కొంత‌మంది వ‌ద్ద నుంచి భారీగా వ‌సూలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల్ని కూడా ప‌వ‌న్ మ‌ర్చిపోకూడ‌దు. ప‌వ‌న్ చెబుతున్న కొన్ని సిద్ధాంతాలు బాగానే ఉన్న‌ట్లు క‌నిపించినా..ఎన్నిక‌ల వేళ‌.. టికెట్ల పంపిణీ సంద‌ర్భంగా త‌న మాట‌ల మీద ఎంత నిల‌బ‌డ‌తారో చూడాలి. కొస‌మెరుపు ఏమంటే.. దాసోజు శ్ర‌వ‌ణ్ గురించి ప్ర‌స్తావించిన ప‌వ‌న్ ను.. ఆయ‌న న‌టించిన గంగ‌తో రాంబాబు సినిమా తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉందంటూ శ్ర‌వ‌ణ్ అప్ప‌ట్లో అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News