2019లో నేనే సీఎం..ఎలా సాధ్యం ప‌వ‌న్‌?

Update: 2018-11-21 16:25 GMT
జ‌నసేన పార్టీ అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న గురించి తాను ఓ సంచ‌ల‌న అంశాన్ని బ‌య‌ట‌పెట్టారు. దాదాపుగా గ‌త ఆరు నెల‌ల నుంచి క్రియాశీల రాజ‌కీయాల్లో బిజీ అయిన ఆయ‌న వీలు దొరికిన‌పుడు పాద‌యాత్ర‌లు - ర‌థ‌యాత్ర‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి జ‌న‌సేనాని త‌న పార్టీని ఇత‌ర రాష్ర్టాల్లో కూడా బ‌లోపేతం చేసేందుకు ఆయా రాష్ర్టాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇలా ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ తాజాగా చెన్నై వెళ్లారు. అయితే, ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అదే రాబోయే సంవ‌త్స‌రంలో తానే ఏపీ ముఖ్య‌మంత్రిని అవుతాన‌ని ప్ర‌క‌టించ‌డం. త‌న లెక్క‌కు త‌గిన వివ‌రాలేంటో ఆయ‌న వివ‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

2003లోనే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని ప‌వ‌న్ క‌ల్యాణ్ వివ‌రించారు. ``తొలుత కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో సీపీఎఫ్ ను ప్రారంభించాను. రెండేళ్లపాటు కార్యక్రమాలు నిర్వహించిన తరువాత.. చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి నేతృత్వం వహించాను. ఆ తర్వాతి కాలంలో.. గాడి తప్పిపోయిన రాజకీయాలు చూసి - రాజకీయంగా జవాబుదారీతనం పెరగాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 2014 ఎన్నికల సమయంలో అప్పటి దేశ - రాష్ట్ర అవసరాల దృష్ట్యా నరేంద్రమోడీ నాయకత్వం - చంద్రబాబునాయుడు అనుభవం రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత.. చంద్రబాబునాయుడు పక్కన పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వంలో అవినీతి వేళ్లూనుకుంది. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో చూస్తే.. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా అవినీతి తాండవిస్తోంది. సాగు నీటి ప్రాజెక్టుల నుంచి ప్రతి చోట అవినీతి తాండవిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఏపీని బాధిస్తోంది. అది వైట్ కాలర్ అవినీతి. ప్రజల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. మేము కులాలకు వ్యతిరేకం. మా పార్టీ సిద్ధాంతాల్లో అదీ ఒకటి. చివరి వరకూ మేము దీన్నే నమ్ముతాం. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది. దక్షిణాదిలో మరింత మంది నీతివంతమైన రాజకీయ నాయకులు రావాలి. ఉదాహరణకు జగన్‌ ను తీసుకుంటే - ఆయనపై ఉన్న కేసుల కారణంగా కనీసం నీతివంతమైన నాయకుల అవసరంపై మాట్లాడే ధైర్యం కూడా జగన్‌ చేయలేరు. 2019లో తప్పకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని అవుతాను`` అంటూ ప‌వ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

దేశ రాజకీయాల్లో జనసేనది కీలక భూమిక అవుతుందని ప‌వ‌న్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం ``రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎంతో అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో వెనక్కు తగ్గి తెలుగు ప్రజలను ఆ పార్టీ మోసం చేసింది. అలాగే బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు సమీకరిస్తున్న కాంగ్రెస్ అనుకూల కూటమిలో చేరే ఆలోచనేమీ లేదు. చంద్రబాబునాయుడును ఏ విషయంలోనూ నమ్మలేం. చంద్రబాబు ఇవాళ ఒక పార్టీని నెత్తిన పెట్టుకుంటే.. రేపు దాన్ని కిందపడదొయగలరు. చంద్రబాబు చెప్పే మహా కూటమితో ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే భవిష్యత్తులో ఆయన వారిని చాలా దారుణంగా మోసం చేయగలరు. చంద్రబాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి.  అయితే తగిన సమయంలో ఏయే పార్టీలతో కలవాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటాను. బీజేపీ - కాంగ్రెస్ - టీడీపీ... ఈ మూడు పార్టీలు ఏ ఎండకు ఆ గొడుగు పడతాయి. దేశానికి నిఖార్సైన పార్టీల అవసరం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం - మాటలు ఊహాగానాలే. అన్ని స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుంది. తెలంగాణలో 19నుంచి 23 స్థానాల్లో పోటీచేయాలని అనుకున్నప్పటికీ.. ముందస్తు వల్ల సాధ్యం కాలేదు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బరిలో ఉంటాం.`` అంటూ ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చారు. ``తమిళనాడుకు జనసేన పార్టీని పరిచయం చేయడానికే చెన్నై వచ్చాను. చంద్రబాబుకు రిటైర్‌ మెంట్ దగ్గర పడింది. పంచాయతీ మెంబరుగా కూడా గెలవలేని నారా లోకేష్‌ ను మంత్రిని చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జనసేనతో ముడిపడి ఉంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మా పార్టీ స్టాండ్‌ ఎటువైపు తీసుకుంటుందో త్వరలోనే చెబుతా అని అన్నారు.

Tags:    

Similar News