పాకిస్థాన్ బిస్కెట్ సిరీస్.. పిచ్చ కామెడీ

Update: 2018-11-01 10:33 GMT
పాకిస్థాన్ క్రికెటర్లు తరచుగా సోషల్ మీడియా జనాలకు దొరికిపోతుంటారు. ఆ దేశ క్రికెట్లో వివాదాలు సర్వ సాధారణం. కొందరు అహంకారం ప్రదర్శించి వివాదాలకు కారణమైతే.. కొందరు అజ్ఞానంతో నెటిజన్లకు దొరికిపోతుంటారు. ఈ మధ్యే మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తనను తాను ‘డాన్ ఆఫ్ క్రికెట్‌’గా అభివర్ణించుకుని నెటిజన్లతో సెటైర్లు వేయించుకున్నాడు. తాజాగా ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డే పెద్ద కామెడీ పీస్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇటీవలే పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో చేజిక్కించుకుంది. ఐతే ఈ సిరీస్ కోసం రూపొందించిన ట్రోఫీ నమూనా సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది.

మూడు వికెట్ల మీద బిస్కెట్ రూపంలో ఉన్న ట్రోఫీని తయారు చేశారు సిరీస్ కోసం. ట్రోఫీ రూపకర్తల ఉద్దేశం ఏమో కానీ.. అదైతే చూడ్డానికి బిస్కెట్ లాగా కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో జనాలు కామెడీ మొదలు పెట్టారు. ఇదొక బిస్కెట్ ట్రోఫీ అంటూ సెటైర్లువేశారు. యూఏఈలో జరిగే సిరీస్‌ల్లో పాకిస్థాన్‌దే ఆధిపత్యం. స్వదేశంలో సిరీస్‌ లు ఆగిపోయాక యూఏఈనే సొంతగడ్డగా మార్చుకుని సిరీస్‌ లు ఆడుతున్న పాకిస్థాన్.. అక్కడ బాగానే విజయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్ విజయానికి విలువ లేదని.. అందుకే దీని ట్రోఫీని బిస్కెట్ ఆకృతిలో తయారుచేశారని.. ఇదొక బిస్కెట్ సిరీస్ అని జనాలు కామెంట్లు చేస్తున్నారు. ట్రోఫీ విషయంలో పెద్ద ఎత్తున జోకులు పేలడంతో అవమానంగా భావించిన పాక్ విచారణకు ఆదేశించింది. ఈ నమూనాను ఎలా అనుమతించారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టింది. దీనికి బాధ్యురాలైన పీసీబీ  మార్కెటింగ్ చీఫ్ నలియా భాటి తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
Tags:    

Similar News