మారిన సెక్ష‌న్ తో ర‌విప్రకాశ్ కు ఎన్ని తిప్ప‌లంటే?

Update: 2019-05-14 05:14 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ9 ర‌విప్ర‌కాశ్ అంటే తెలీని వారు ఉండ‌రు. అంత‌టి మీడియా ప్ర‌ముఖుడు ఇప్పుడు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మోసం.. ఫోర్జ‌రీతో స‌హా ప‌లు నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆయ‌న్ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా సైబ‌రాబాద్ పోలీసులు ఇప్ప‌టికే నోటీసులు జారీ చేశారు.

దీంతో పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ర‌విప్ర‌కాశ్ వెళ‌తారా? అన్న సందేహం వినిపిస్తున్న వేళ‌.. ఆయ‌న క‌నిపించ‌కుండా పోవ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ర‌విప్ర‌కాశ్‌.. పోలీసుల నోటీసుల‌కు స్పందించ‌టం లేదు. ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఆయ‌న్ను విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ.. ఇంటి గోడ‌కు నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఇలాంటివేళ‌.. పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు ప‌ది రోజుల స‌మ‌యం కావాల‌ని లాయ‌ర్ల ద్వారా కోరిన ర‌విప్ర‌కాశ్ వాద‌న‌ను కోర్టు ఆమోదించ‌లేదు.

ఇదిలా ఉండ‌గా.. తాము రెండు ద‌ఫాలు నోటీసులు ఇచ్చినా విచార‌ణ‌కు రాని ర‌విప్ర‌కాశ్ పై తాజాగా కొత్త సెక్ష‌న్ ను పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు సీఆర్ పీసీ 160 ప్ర‌కారం జారీ చేసిన నోటీసుల స్థానే.. తాజాగా సెక్ష‌న్ 41 ప్ర‌కారం నోటీసులు జారీ చేశారు. తాజాగా మార్చిన సెక్ష‌న్ తో ర‌విప్ర‌కాశ్ కు కొత్త తిప్ప‌లు ఖాయ‌మంటున్నారు.

తాజాగా అంటించిన నోటీసులో 15వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పేర్కొన్నారు. మారిన సెక్ష‌న్ కార‌ణంగా ర‌విప్ర‌కాశ్ కు ఎదుర‌య్యే ఇబ్బందేమంటే.. విచార‌ణ‌కు పోలీసులు చెప్పిన స‌మ‌యానికి హాజ‌రు కాకుంటే.. గ‌డువు తీరిన త‌ర్వాత ఏ క్ష‌ణంలో అయినా అరెస్ట్ చేసే వీలుంటుంది. తొలుత జారీ చేసిన సీఆర్ పీసీ 160 సెక్ష‌న్ ప్ర‌కారం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని కేవ‌లం విచార‌ణ‌కు మాత్ర‌మే పిలిచే అవ‌కాశం ఉంటుంది. దాని స్థానే తాజాగా మార్చిన సెక్ష‌న్ 41లో అయితే.. కేసు తీవ్ర‌త ఆధారంగా అరెస్ట్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

సాధార‌ణంగా ఏడేళ్ల లోపు శిక్ష ప‌డే కేసుల్లోనే ఈ సెక్ష‌న్ ను ప్ర‌యోగిస్తారు. నిందితులు సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేయ‌టం.. వారిపై బెదిరింపుల‌కు దిగ‌టం.. కీల‌క ఆధారాలు ధ్వంసం చేస్తార‌న్న అనుమానం వ‌స్తే.. జ‌డ్జి అనుమ‌తి తీసుకొని అరెస్ట్ చేసే వీలుంది. తాజాగా మార్చిన సెక్ష‌న్.. రానున్న రోజుల్లో జ‌ర‌గాల్సింది జ‌రిగేలా చేయ‌టం కోస‌మేనా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News