అబ్బే రాహులా?... నిన్న పిన్న‌మ్మ‌ - నేడు త‌మ్ముడు!

Update: 2019-04-21 11:35 GMT
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ... ఎప్పుడెప్పుడు పీఎం కుర్చీలో కూర్చుందామా? అంటూ ఆరాట‌ప‌డుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో నాటి సిట్టింగ్ ఎంపీ మ‌న్మోహ‌న్ సింగ్ ను ఒక్క దెబ్బ‌కు ప‌క్క‌న‌పెట్టేసి... యూపీఏ మ‌రోమారు అధికారంలోకి వ‌స్తే... తానే పీఎంనంటూ రాహుల్ బ‌రిలోకి దిగారు. అయితే మోదీ మేనియా ముందు ఆయ‌న క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయారు. మన్మోహ‌నే పీఎం అభ్య‌ర్థిగా బ‌రిలో ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో గానీ... రాహుల్ పుణ్య‌మా అని లోక్ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో అధికార ప‌క్షం ఎన్డీఏ కాళ్లావేళ్లా ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను చేజిక్కించుకుంది. ఇది జ‌రిగి అప్పుడే ఐదేళ్లు అయిపోయింది. ఇప్పుడు మ‌రోమారు సార్వ‌త్రిక ఎన్నిక‌లు హోరాహోరీగా జ‌రుగుతున్నాయి. ఈ ద‌ఫా కూడా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదన్న మాట వినిపిస్తోంది.

ఈ అంచ‌నాలు చూసిన త‌ర్వాతే... రాహుల్ మ‌దిలోని ప్ర‌ధాని క‌ల... క‌ల‌గానే మిగిలిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న పిన్న‌మ్మ‌, బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి మేన‌కా గాంధీ సంచ‌లన వ్యాఖ్య చేసి క‌ల‌క‌లం రేపారు. సొంత పిన్న‌మ్మ‌కే రాహుల్ పై ఈ త‌ర‌హా అంచ‌నాలుంటే... ఇక మిగిలిన వారి ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రాహుల్ గాంధీ ఈ జ‌న్మ‌లో పీఎం అయ్యే ఛాన్సే లేదంటూ మేన‌క చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య రాహుల్ ను బాగానే ఇబ్బంది పెట్టేసిందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏదో వైరి వ‌ర్గంలో ఉన్నారు కాబ‌ట్టి... రాహుల్ గాంధీపై మేన‌క ఆ కామెంట్లు చేసి ఉంటారులే అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే... ఎంతైనా స్వ‌యానా త‌న భ‌ర్త ర‌క్తం పంచుకుపుట్టిన బావ కొడుకుపై మేన‌క అంత ఈజీగా కామెంట్లు చేయ‌రు క‌దా. స‌రే ఎన్నిక‌ల వేళ ఈ త‌ర‌హా వ్యాఖ్యలు సాధార‌ణ‌మే అని అంతా అనుకున్నారు.

ఇలాంటి త‌రుణంలో పిన్న‌మ్మ‌తో పాటు రాహుల్ పై ఆ పిన్న‌మ్మ కుమారుడు, త‌న సోద‌రుడు సుల్తాన్ పూర్ సిట్టింగ్‌ ఎంపీ (ఫిలిబిత్ బీజేపీ అభ్య‌ర్థి) వ‌రుణ్ గాంధీ కూడా అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు వైర‌ల్ గానే మారిపోయింది. ఈ ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయ్యే ఛాన్సే లేదంటూ వ‌రుణ్ కూడా సంచ‌ల‌న కామెంట్ చేశారు. ఇప్పుడు కాదు గానీ... ఇంకో ఇర‌వై ఏళ్ల వ‌ర‌కు కూడా రాహుల్ ప్ర‌ధాని కాలేర‌ని కూడా వ‌రుణ్ మ‌రో ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. రాహుల్ జ‌న్మ‌లో పీఎం కాలేర‌ని పిన్న‌మ్మ అంటే.. ఇప్పుడు త‌మ్ముడేమో ఓ 20 ఏళ్ల వ‌ర‌కు పీఎం కాలేరంటూ చేసిన కామెంట్లు చూస్తుంటే... రాహుల్ కు నిజంగానే ప్ర‌ధాని అయ్యే యోగ్య‌మే లేదేమోన‌న్న భావ‌న క‌లుగుతోంది.


Tags:    

Similar News