వైసీపీ ఎంపీ కల్యాణ మండపంలో రేషన్ బియ్యం..విచారణకు ఆదేశం!

Update: 2020-04-28 10:10 GMT
పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం వైసీపీ ఎంపీ కల్యాణ మండపంలో దర్శనమివ్వడం కలకలం రేపింది. విశాఖపట్నంలోని పౌరసరఫరాల శాఖకు చెందిన గోదాం నుంచి  అనకాపల్లిలోని గవరపాలెం డీలర్ కు వెళ్లాల్సిన బియ్యం లారీ సోమవారంర రాత్రి  అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతికి చెందిన కల్యాణ మండపం వద్దకు చేరుకుంది.

రేషన్ బియ్యం ఇక్కడ ఆగడంపై అనుమానం వచ్చిన స్థానికులు సీపీఎం నాయకులకు తెలుపగా వారు వచ్చి లారీ డ్రైవర్ ను ప్రశ్నించారు. దీంతో తమ డీలర్ ఇక్కడికి తీసుకురమ్మన్నాడని డ్రైవర్ తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న పట్టణ రేషన్ డీలర్ల సంఘం నాయకుడు అక్కడకు చేరుకొని ఎంపీ సత్యవతి గారి కోరిక మేరకు పేదలకు పంచడానికి కొంత రేషన్ బియ్యం సర్దుబాటు చేయమన్నారని.. మళ్లీ వెనక్కి ఇస్తామన్నారని.. అందుకే ఇక్కడ కొన్ని బస్తాలు వేయడానికి తీసుకొచ్చామని తెలిపారు.

దీనిపై సీపీఎం నాయకులు రేషన్ బియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం నేరం అని ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో సదురు రేషన్ డీలర్ల సంఘం నాయకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇక ఈ విషయం వైరల్ కావడంతో జాయింట్ కలెక్టర్ స్పందించి తహసీల్దార్ ను విచారణ చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ వచ్చి సందర్శించి వెళ్లిపోయారు.

ఇక అనకాపల్లిలో అనుమతి లేని ప్రదేశానికి రేషన్ బియ్యం రవాణా చేసిన వ్యవహారంపై విచారణకు ఆదేశించామని.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని కేసు కూడా నమోదు చేస్తామని జేసీ శివశంకర్ తెలిపారు.


Tags:    

Similar News