హైదరాబాద్ లో సైకిల్ తొక్కిన కేంద్రమంత్రి

Update: 2016-11-06 04:46 GMT
సైకిల్ మీద మనసు పడ్డారు కేంద్ర ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్. మనసు పడటమే కాదు.. దాని మీద ఎక్కి తొక్కే వరకూ ఆయన ఉండలేకపోయారు. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన మనసును దోచుకున్న ఈ సైకిల్ వ్యవహారం కాసింత ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. తాజాగా హైదరాబాద్ లోని టీ హబ్ తో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. టీ హబ్ సందర్శన సందర్భంగా పలు స్టార్ట్ ప్ ల ప్రతినిదులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా గాయమ్ ఆటో వర్క్స్ కు చెందిన బ్యాటరీతో నడిచే సైకిల్ ను చూశారు. దీనిపై ప్రత్యేక ఆసక్తి కనబర్చిన ఆయన.. దాని వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. బ్యాటరీపై గంటకు 25 కిలోమీటర్లు ప్రయాణించే వీలున్న ఈ సైకిల్ ను విడిగా కూడా నడిపే వీలుంది. ఈ సైకిల్ వివరాల్ని తెలుసుకున్న ఆయన.. దాన్ని తొక్కాలన్నఅభిలాషను వ్యక్తం చేశారు. సైకిల్ మీద ఎక్కిన ఆయన.. తన ముచ్చట తీర్చుకున్నారు.

బ్యాటరీతో నడిచే ఈ సైకిల్ ను ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పిన కంపెనీ ప్రతినిధి ఇప్పటివరకూ 50 సైకిళ్లను ఎగుమతి చేసినట్లుగా పేర్కొన్నారు. త్వరలో  తమ బ్యాటరీ సైకిల్ అమ్మకాలు హైదరాబాద్ లో కూడా షురూ చేయనున్నట్లగా పేర్కొన్నారు. కేంద్రమంత్రి మనసును దోచుకున్న సదరు సైకిల్ ధర రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకూ ఉండే వీలుందని చెబుతున్నారు. లిమిట్ లెస్ బైక్ పేరిట పేర్కొంటున్న ఈ బ్యాటరీ సైకిల్ కేంద్రమంత్రితో పాటు.. పలువురి మనసుల్ని దోచుకుంది.

ఇదిలా ఉంటే.. స్టార్ట్ ప్ లకు ప్రపంచంలోనే హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారిందని పేర్కొన్నకేంద్రమంత్రి..  టీ హబ్ ను ప్రశంసించటం గమనార్హం. టీ హబ్ తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా ఆయన అభివర్ణించటం గమనార్హం. ఇదిలా ఉండగా.. టీ హబ్ కు రావటం గొప్ప అనుభూతికి గురి చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ కు.. కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అజయ్ కుమార్ ట్వీట్ చేయటంపై తెలంగాణ సర్కారు ఖుషీఖుషీగా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News