తెలంగాణలోని ఆ ఊరిలో 40 ఏళ్లుగా ఒక్క కేసు నమోదు కాలేదు..

Update: 2022-10-03 06:35 GMT
ప్రతిరోజూ ఎక్కడో చోట హత్యలు, మానభంగాలు, దాడులు జరుగుతున్న వార్తలు చదువుతూనే ఉంటాం. పోలీస్ స్టేషన్ కు పదే పదే వెళ్తున్న  వారి సంగతి వింటూనే ఉంటాం. కానీ  తెలంగాణలోని ఓ ఊరిలోని జనం 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు. కనీసం వారికి పోలీసుల అవసరం కూడా ఏర్పడలేదు. ఉన్నది వెయ్యి మందే అయినా ఏ సమస్య వచ్చినా ఊరిలోని పెద్దలే పరిష్కరిస్తారు. ఒకరినొకరు బంధువుల్లా ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా   జిల్లా న్యాయమూర్తి ఆ గ్రామాన్ని విజిట్ చేశారు. ఈ సందర్భంగా కేసుల్లేని గ్రామంగా ప్రకటించారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? వివాదాలకు ఎందుకు తావివ్వడం లేదు..? అందుకు ఏం చేశారు..?

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో దేశంలో క్రైం రేటు విపరీతంగా పెరిగిపోయింది. హత్యలు, మానభంగాలు, దాడులతో కొన్ని ప్రాంతాలు ఇంకా పగలతోనే బతుకుతున్నాయి. కానీ ఆ ఊరిలో మాత్రం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ కేసు నమోదు కాలేదు. ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా పెద్దల సమక్ష్ంలోనే పరిష్కరించుకుంటారు.

తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలంలో ఉంది ర్యాగుట్టపల్లి గ్రామం. ఇక్కడ 180 కుటుంబాలు జీవిస్తున్నాయి. మొత్తంగా 1000 మంది జనాభా ఉంటారని అంచనా. చికాకులు, చింతలు లేని గ్రామంగా పేరొందిన ఇక్కడి ప్రజలంతా ఐకమత్యంగా ఉంటారు. ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకుంటూ బంధువుల్లా మెదులుతారు. ఊరి జనం మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కొందరు కూరగాయల సాగు చేస్తూ నాణ్యమైన పంటలు తీస్తున్నారు.

ఈ గ్రామంలో సమస్యలు పరిష్కరించడానికి ఊరి జనం పెద్దలను ఆశ్రయిస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఏర్పడితే వారు ఆ పెద్దలకు చెబుతారు. ఓ రోజు సమయం పెట్టి కోర్టుల్లాగా ఇరువురికి నచ్చజెబుతారు. అక్కడితోనే సమస్య పరిష్కరించి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా జాగ్రత్తపడుతారు. సాధారణ సమయాల్లో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా చూసుకుంటుంది ఆ పెద్దల సంఘం.

ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అందరూ కలిసి గ్రామాభివృద్ధికి పాటుపడుతారు. మద్యం సేవించడం వల్ల గొడవలు వస్తాయని ర్యాగుట్టపల్లిలో దానిని నిషేధించారు. 12 ఏళ్లుగా ఈ గ్రామంలోకి మద్యం చొరబడడం లేదు. ఒకవేళ ఊరి జనానికి తెలియకుండా మద్యాన్ని తీసుకొస్తే 5వేల జరిమానా విధిస్తారు.
ఇదిలా ఉండగా వృద్ధుల సమస్యలు పరిష్కరించడానికి మరో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘం వారి బాగోగులను చూసుకుంటుంది. ఈ సంఘంలో 63 మంది సభ్యులు ఉన్నారు.

రెండు నెలల కిందట  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ర్యాగుట్టపల్లిని కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి సందర్శించారు. కేసుల్లేని గ్రామంగా ప్రకటించారు. ఊరి అలవాట్లును చూసి ముచ్చటపడ్డారు. ప్రతి ఒక్కరు ఇలా ఐకమత్యంగా ఉంటే గ్రామాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ఊరికి వస్తే తన సొంత ఊరికి వచ్చినట్లుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఇక ర్యాగుట్టపల్లికి రావడం సంతోషంగా ఉందని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News