ఎంపీ క‌విత‌కు కేంద్ర మంత్రి చుర‌క‌లు

Update: 2015-08-05 10:56 GMT
ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌పై కేంద్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, ఏపీకి కొత్త హైకోర్టును త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ పార్ల‌మెంటు సాక్షిగా తెలిపారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశామనీ ఆయ‌న బుధ‌వారం లోక్‌స‌భ‌లో చెప్పారు. అదే స‌మ‌యంలో తెరాస ఎంపీ క‌విత‌కు కౌంట‌ర్ వేశారు. చిన్న‌పిల్ల‌లా మాట్లాడొద్ద‌ని హిత‌వు ప‌లుకుతూ సభలో లేని వ్యక్తుల పేర్లు ప్ర‌స్తావించొద్ద‌ని సూచించారు. హైకోర్టు విభ‌జ‌న‌కు కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌న్న క‌విత వ్యాఖ్య‌ల‌పై స‌దానంద తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. మ‌రో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా క‌విత తీరును త‌ప్పుప‌ట్టారు.

హైకోర్టు విభజన అంశం లోకసభలో చర్చకు వచ్చిన సందర్భంగా సదానంద గౌడ మాట్లాడుతూ.... హైద‌రాబాద్ లో ప్ర‌స్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంద‌ని చెప్పారు.. ఏపీలో కొత్త  హైకోర్టు ఏర్పాటుచేస్తామ‌ని... దానికి మౌలిక వసతులు స‌మ‌కూర్చాల్సిన బాధ్య‌త ఏపీ ప్రభుత్వానిదేనని  చెప్పారు. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా వారు కోరుకున్న చోట హైకోర్టు ఏర్పాటుచేస్తామ‌ని ప్ర‌క‌టించారు.  విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏ స్థలంలో హైకోర్టు ఏర్పాటు చేయాలో ఏపీ సర్కార్ నిర్ణయించుకోవాలన్నారు. కాగా హైకోర్టు విభ‌జ‌న‌పై నిబంధ‌న‌లు, కేంద్రం వైఖ‌రి గురించి ఇదంతా ముందే ఊహించిందే అయినా దీనిపై చ‌ర్చ జ‌రిగిన స‌మ‌యంలో న్యాయ‌శాఖ మంత్రి సదానంద గౌడ ఎంపీ క‌విత‌నుద్దేశించి అన్న మాట‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. చురుగ్గా ఉండ‌డం.. దూకుడుగా ఉండ‌డం.. ఎక్కువ చేయ‌డం మ‌ధ్య ఉన్న తేడాల‌ను మంత్రి స‌దానంద గౌడ వ్యాఖ్య‌లు ప‌ట్టి చూపాయ‌ని... టీఆరెస్ ఎంపీలు పార్ల‌మెంటులో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఆయ‌న వ్యాఖ్య‌లు ఎండ‌గ‌ట్టాయ‌ని అంటున్నారు.
Tags:    

Similar News