కేవీపీ మరో సంచలనం.. పార్లమెంట్ లో ప్రైవేట్ తీర్మానం

Update: 2020-03-05 10:45 GMT

కొన్నాళ్లయితే పదవి కాలం తీరనుంది. అయినా కూడా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోసారి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై ప్రైవేటు తీర్మానం కోరారు. దీంతో శుక్రవారం రాజ్యసభలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు విభజనతో అన్యాయం జరిగిందని, వెంటనే అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి అమలు చేయాలని కోరుతూ కేవీపీ ప్రైవేటు తీర్మానం ఇస్తూ స్పీకర్ కు లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం యథావిధిగా సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ కేవీపీ తీర్మానం ప్రవేశపెట్టారు. 15వ ఆర్థిక సంఘం తాత్కాలిక నివేదికలో పేర్కొన్న అంశాల ఆధారంగా ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించి 2021లోపు పూర్తి చేయాలని విన్నవిస్తున్నారు. దీంతో పాటు ప్రైవేటు తీర్మానంలో పలు అంశాలను పేర్కొన్నారు. ఏపీ ఆర్థికాభివృధ్ది, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన కోసం పన్ను మినహాయింపులు, ప్రోత్సాహాలు ఇవ్వాలని, 2014 జూన్ 2 నుంచి 2015, మార్చి 31 వ తేదీ మధ్య ఏపీకి కలిగిన వనరుల కొరతను, రాష్ట్రం ఇచ్చే లెక్కల ప్రకారం, కేంద్రం చెల్లించాలని తదితర కోరుతూ తీర్మానంలో వివరించారు.
దుగ్గరాజపట్నం పోర్ట్ నిర్మాణం కోసం కేంద్రమే గ్రాంట్ గా వనరులు సమకూర్చాలని, కడపలో సమీకృత స్టీల్ ప్లాంట్, కాకినాడలో గ్రీన్ ఫీల్డ్ ఆయుల్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సదుపాయం ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ను అభివృద్ధి చేయాలని ప్రైవేట్ మెంబర్ తీర్మానంలో కోరారు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడంతో ఏపీకి తీరని నష్టం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై శుక్రవారం చర్చ జరుగుతుందని కేవీపీ ప్రకటించారు. ఏపీకి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్న నేపథ్యంలో దేశానికి తెలిసేలా ఈ ప్రైవేటు మెంబర్ తీర్మానం ఇచ్చినట్లు కేవీపీ వివరించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, సహకారం అందించాలని కోరారు.



Tags:    

Similar News