ఓర్నీ.. మీడియాను సీన్లోకి తెచ్చేస్తున్నారే?

Update: 2017-01-19 07:58 GMT
మీడియా.. తన మానాన తాను ఉండేందుకు సైతం ఒప్పుకోవటానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది సోషల్ మీడియా తీరు చూస్తుంటే. సంబంధం లేని అంశాలకు ముడులు కట్టేసి..కొత్త కొత్తగా కొట్టుకునేలా చేయటం.. జనాల మనసుల్లో మరింత విషాన్ని నింపటానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తే.. ఓర్నీ అనుకోకుండా ఉండలేం. ఇక్కడ మీడియాను వెనకేసుకు రావటమో.. మరొకరిని తిట్టిపోయటమే ఉద్దేశం ఎంతమాత్రం కాదు. నిజాన్ని కాస్త కాకున్నా కాస్త అయినా చెప్పాల్సిన ధర్మం ఉందిగా.

నిజాల్ని చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజం నిప్పులాంటిది ఏదో ఒక రోజు దాని తీవ్రత తెలుస్తుందని ఊరుకుంటే.. దావనం లాంటి అబద్ధంగా నిప్పు లాంటి నిజాన్ని ఓవర్ టేక్ చేస్తుందనటంలో సందేహం లేదు. అందుకే.. నిజాన్ని ఎప్పటికిప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత.. ఉత్సాహం ఉన్నోళ్లతో పాటు.. అత్యుత్సాహం ఎక్కువగా ఉండేవారికి ఒక అయుధంగా మారిపోయింది సోషల్ మీడియా. కాస్తంత చతురత.. మరికాస్త ఇంపుగా రాసే శక్తితో పాటు.. లాజిక్ ను నేర్పుగా చెప్పే తెలివితేటలు ఉంటే చాలు.. మనసులోని విషాన్ని పోస్టుల రూపంలో వేసేయటం.. వాటిని వర్గాల వారీగా ఎవరికి వారు ప్రమోట్ చేయటం ఈ మధ్యన అలవాటుగా మారింది.

దీంతో.. నిజాన్ని వదిలేసి.. ఎవరెంత బాగా ప్రచారం చేసుకుంటారో.. ఆ ప్రచారం చేసినోడు.. వారి వాదన.. అలాంటి వాదనలకు మద్దుతు ఇచ్చే వారి మాటలే నిజాలుగా చెలామణీ అవుతున్న దుస్థితి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన పుష్కర కాలంలో మీడియా మీద.. మీడియావిశ్వసనీయత మీద చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలా బయటకు వచ్చే కథనాల్లో అన్ని నిజాలు కావు.. అలా అని అన్ని అబద్దాలు కావన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మీడియా కులాల ఆధారంగా చీలిపోయిందని.. తమ కులానికి చెందిన హీరో సినిమాల విడుదల విషయంలో భారీ ప్రాధాన్యత ఇచ్చేస్తుందని.. తమ వారి సినిమాలకు తమ మీడియాలో పెద్దపీట వేస్తారంటూ సాగుతున్న రొచ్చు మాటల్ని వింటే కంపరం కలగక మానదు. మీడియాలో పని చేస్తూ.. మీడియా సంస్థల్లోని ప్రముఖులతో పరిచయం ఉన్న వారికి ఇలాంటి మాటలు చులకనగా ఉండటమే కాదు.. మరీ.. ఇంత సొల్లు మాటలేందన్న భావన కలగటం ఖాయం.

నిజానికి ఇలాంటి వాటి గురించి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ.. ఇలాంటి వాటిని నిజాలుగా ఫీలై.. అదే పనిగా షేర్స్ మీద షేర్స్ చేస్తూ.. ప్రచారం చేసే వారికి కౌంటర్ గా నిజాల్ని చెప్పల్సిన బాథ్యత ఎంతైనా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజంగా మీడియాకు కానీ కులగజ్జి ఉండి ఉంటే.. తన బలమైన వాదనతో ఒక వర్గానికి మాత్రమే ప్రచారం చేయాలి. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. అయితే.. ఇలాంటి వాస్తవాన్ని కొందరు వక్రీకరించే విధానం చూస్తే వారి తెలివికి ఆశ్చర్యపోవాల్సిందే.

అదేమంటే.. మీడియాలో బలమైన వర్గంగా ఉన్న వారు సంక్రాంతి సందర్భంగా విడుదలైన తమ వారి సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారని.. అది సోషల్ మీడియా విజయంగా అభివర్ణించటం చూస్తే.. తమకేమాత్రం సంబంధం లేని విషయాల్లోకి మీడియాను లాగుతున్న వారు మామూలు ముదుర్లు కాదు సుమా అన్న భావన కలగటం ఖాయం. ఒకవేళ.. మీడియా కానీ వర్గాలుగా విడిపోతే.. వాటిని గుర్తించలేనంత దీనమైన స్థితిలో పాఠకులు లేరు. ఒకవేళ కులాల కుమ్ములాటల్లోకి మీడియా సంస్థలు వెళితే.. ఛీ కొట్టటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినా.. కులాలకు కిలోమీటర్ల దూరంతో ఉండే మీడియా మీద ఇలాంటి దుర్మార్గమైన ప్రచారం చేస్తున్న వారి పట్ల జాగరూకతో ఉండాలి. లేకుంటే.. తమ మాటలతో మనుషుల మధ్య మంటలు పెట్టేస్తారు సుమి. బీకేర్ ఫుల్. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News