సోనియాకు సోషల్ మీడియా సెగ

Update: 2015-11-01 10:31 GMT
భారత్ ఆత్మగా చెప్పే భిన్నత్వంలో ఏకత్వం ఇప్పుడు ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెగ ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో పెరిగిన ద్వేష భావం, మతతత్వ సిద్ధాంతాల కారణంగా భారత సంస్కృతికి ప్రతీకగా నిలిచిన భిన్నత్వంలో ఏకత్వం ప్రమాదంలో పడిందని ఆమె గొంతు చించుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రమాదంలో పడటమంటే దేశ ప్రతిష్ట, గౌరవం ప్రమాదంలో పడినట్లేనని సోనియా గాంధీ అంటున్నారు.
 
దేశంలో ప్రజలలో ద్వేషభావం రెచ్చగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిపిస్తున్న సోనియా ఇటీవలి కాలంలో దేశంలో మత అసహనం పెరిగిందని సూచించేలా జరిగిన సంఘటనలన్నీ ప్రజలను మతపరంగా విభజించాలన్న కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు.

అయితే... సోనియా ఇలా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రమాదమేర్పడుతుంది అనడంపై సోషల్ మీడియాలో మరోరకంగా సెటైర్లు పడుతున్నాయి. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్లే కాంగ్రెస్ పార్టీలోనూ భిన్నత్వంలో ఏకత్వం ఉందని... ఆ పార్టీలో ఎన్ని వర్గాలు, ఎన్ని ముఠాలు ఉన్నా అందరూ అధిష్ఠానానికి బద్ధులేనని.. అయితే... మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడిన తరువాత ఆ పార్టీలో భిన్నత్వానికి ప్రమాదమేమీ రాకపోయినా ఏకత్వానికి మాత్రం ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు. రాహుల్ పై సీనియర్లు గుర్రుగా ఉన్నారని.. సోనియాకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకపోయినా ఆమెపైనా అసంతృప్తితోనే ఉన్నారని సోషల్ మీడియా ఘోషిస్తోంది. సోనియా భిన్నత్వంలో ఏకత్వం కామెంట్లను సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకే వర్తింపజేసి సెటైర్లు వేస్తోంది.
Tags:    

Similar News