ఏపీకి రాజధాని శాపం ఉన్నట్లే.. బీజేపీకి ఏపీలో ఎదగలేని శాపం ఆ పార్టీకి ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు లోక్ సభలో రెండంటే రెండు సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ.. ఇప్పుడు దేశంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. బీజేపీకి రెండు సీట్లు వచ్చినప్పుడు ఏపీలో ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో.. దేశంలోని మెజార్టీ రాష్ట్రాలకు తోపుగా ఆ పార్టీ ఉన్నప్పటికీ.. ఏపీలో మాత్రం ఎదిగింది లేదు. ఎందుకిలా? అన్నది ప్రశ్న.కొంతకాలం పాటు ఏపీలో తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా ఉండటం.. ఆ తర్వాత ఒంటరి ప్రయాణం.. మళ్లీ అవకాశం వస్తే మళ్లీ అదే టీడీపీకి తోక పార్టీగా మారటం.. మళ్లీ తేడా రావటం.. ఒంటరి కావటం తెలిసిందే. ఇలాంటివేళలో.. పవన్ జనసేనతో జత కట్టటం తెలిసిందే. తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం ఏపీ బీజేపీ నేతలకు ఎక్కువని చెప్పాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బేస్ చూస్తే.. ఏపీ కంటే తెలంగాణలో మెరుగ్గా కనిపిస్తుంది. 2014 విభజన తర్వాత ఆ పార్టీ తెలంగాణలో అంతకంతకూ బలోపేతం అవుతుంటే.. ఏపీలో మాత్రం అంతకంతకూ తన పేరు ప్రఖ్యాతుల్ని కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు అయితే.. ఏపీలో బీజేపీ అంటేనే మండిపడేవారు బోలెడంత మంది కనిపిస్తారు.విభజన వేళ.. కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలిచినప్పటికి.. ఆ పార్టీ మాత్రంచేయగలిగింది ఏముందన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఉన్న అద్భుతమైన అవకాశాన్ని మోడీ దెబ్బ తీశారని చెప్పాలి.
ప్రత్యేక హోదాను ఇచ్చినా.. రాజధానిగా అమరావతికి అవసరమైన నిధులు ధారాళంగా ఇచ్చినా ఆ పార్టీ తీరు వేరుగా ఉండేది. కానీ.. ఆ రెండు చేయకపోవటమే కాదు.. విశాఖ ఉక్కుపరిశ్రమనుప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుగా వ్యవహరించటం.. విశాఖలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే డివిజన్ విషయంలోనూ తొండాట ఆడటం ఆ పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. ఏపీలో ఆ పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ తీసింది.
ఇలాంటివేళ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా ఒకటే పరిస్థితి అన్న మాట వినిపిస్తోంది.
ప్రస్తుతానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఆయన్ను మార్చేసి.. ఆయన స్థానంలో కన్నాకు కానీ.. ఇంకెవరికైనా కానీ ఇస్తారన్నప్రచారం జోరుగా సాగుతుంది. ఏపీ బీజేపీ పగ్గాలు ఎవరికి ఇచ్చినా.. సాధించేదేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వానికి సరైన వ్యూహం లేకపోవటం.. ఏపీలో పార్టీని బతికించుకునే కన్నా.. తన చేతులతో తానే చంపుకునే విషయంలో ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్న ధోరణిని పలువురు ప్రస్తావిస్తున్నారు. బీజేపీ మీద అభిమానం ఉన్నా.. ఏపీ మీదా ఏపీ ప్రజల మీదా ఆ పార్టీకి అభిమానం లేనప్పుడు.. ఎవరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినా ఒకటేనన్న మాట వినిపిస్తోంది. పీకేందుకు ఏమీ లేనప్పుడు ఎవరు అధ్యక్షుడైతే మాత్రం ఏముంటుందన్న అభిప్రాయం పలువురి నోట రావటం గమనార్హం.