మోడీ ఇలాకాలో సోనియా హల్ చల్

Update: 2016-08-02 08:03 GMT
ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హల్ చల్ చేస్తున్నారు.  వారణాసిలో సోనియా గాంధీ పర్యటన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా స్పీడు పెంచింది. అధినేత్రి సోనియాగాంధీకి స్వాగతం పలుకుతూ వేలాది బ్యానర్లు కట్టి వారణాసిని మొత్తం సోనియా బొమ్మలతోనింపేసింది.  ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగనున్న వేళ - ఎన్నికల ప్రచార శంఖారావాన్ని వారణాసి నుంచి ప్రారంభించాలని సోనియా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో సోనియా పర్యటనను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయడానికి సిద్ధమయ్యారు.

సోనియాగాంధీ సహా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ - కాంగ్రెస్ నేతలు రాజ్ బబ్బర్ - గులాంనబీ ఆదాజ్ తదితరులు వారణాసిలో ర్యాలీ తీయనున్నారు. వారి ర్యాలీకి ముందు 10 వేల బైకులతో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించనున్నారు.  ఆపై జరిగే బహిరంగ సభకు లక్షలాది మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  మరోవైపు ప్రధాని నియోజకవర్గంలో సోనియా పర్యటన నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగింది.

మోడీ పాలనలో ఆయన సొంత నియోజకవర్గం వారణాసి ప్రజలు బాధల్లో కూరుకుపోయాయని సోనియా ఇప్పటికే ఆరోపించారు. దీంతో వారణాసి బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.  మోడీ కారణంగా అభివృద్ధికి నోచుకోని వారణాసిని తాము తిరిగి గాడిన పెడతామని సోనియా అంటున్నారు.  అంతేకాదు.. మోడీ సొంత రాష్ట్రంలో గుజరాత్ లో పరిస్థితులపైనా కాంగ్రెస్ కామెంట్లు చేస్తోంది. పదమూడేళ్ల మోడీ పాలన కనీసం రెండేళ్ల అనందీ బెన్ పాలనకు సమానం కాదని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రంలో దళితులు నిరసనలు తెలియజేస్తున్నందునే ఆమెను తొలగించాలని భావిస్తున్నారని ఆరోపించారు. యూపీలోని 21 శాతం దళిత ఓటర్లు బీజేపీకి బుద్ధి చెప్పనున్నారని రాహుల్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ విమర్శులు, ఆరోపణల నేపథ్యంలో, సోనియా పర్యటనతో వారణాసిలో వేడి పెరిగింది.
Tags:    

Similar News