అమ్మా కొడుకులు కోర్టుకు వెళుతున్నారా?

Update: 2015-12-08 04:03 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి చిత్రమైన పరిస్థితి ఏదురైంది. పదేళ్ల పాటు సింగిల్ హ్యండ్ తో దేశాన్ని నడిపించిన సోనియమ్మ.. ఒక కేసుకు సంబంధించి కోర్టు గుమ్మం ఎక్కాల్సి రావటం.. ప్రధానమంత్రి సీటులో కూర్చోవాలని అమ్మ కలగన్న రాహుల్ గాంధీ కూడా కోర్టుకు రావాల్సి రావటం ఇప్పుడు చర్చగా మారింది.

నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వివాదం గాంధీ ఫ్యామిలీని చుట్టుకునేలా ఉందన్న మాట వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం కార్యకలాపాలు ఆపేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే ‘‘అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్’’ సంస్థకు కాంగ్రెస్ పార్టీ రూ.90.25కోట్లు అప్పుగా ఇచ్చింది. అయితే.. ఆ అప్పు వసూలు సాధ్యం కాకపోవటంతో.. 2010 డిసెంబరు 10న ఆ రుణాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా అనే చారిటీ సంస్థకు పార్టీ కేవలం రూ.50 లక్షలకు అప్పజెప్పింది. రూ.90కోట్ల అప్పును వసూలు చేయటానికి రూ.50లక్షలకే వేరే వారికి ఇచ్చేస్తారా? అన్నది ప్రధాన ప్రశ్న.

ఇప్పుడు ఇదే వ్యవహారం తల్లీ.. కొడుకుల్ని చుట్టుకుంది. అంత పెద్ద మొత్తాన్ని ఒక సంస్థకు రూ.50లక్షలకే ఎలా అప్పజెబుతారని? ఆ అవసరం ఏమొచ్చిందన్నది కోర్టు ప్రశ్న. నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు కాంగ్రెస్ పార్టీ అప్పు ఇచ్చిన రూ.90 కోట్లను రూ.50లక్షలకు అప్పజెప్పిన యంగ్ ఇండియాలో సోనియమ్మకు.. రాహుల్ కు చెరో 38 శాతం చొప్పున వాటా ఉందని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది అసలు ఆరోపణ.

బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఈ ఆరోపణ చేస్తూ.. కోర్టు గుమ్మం ఎక్కారు. అయితే.. కోర్టుకు రావాల్సిన అవసరం లేదంటూ తల్లీకొడుకులు పెట్టుకున్న పిటీషన్ ను తాజాగా ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు.. నిందితులుగా ఉన్న వారిలో నేర స్వభావం ఉన్నట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించటం కాంగ్రెస్ వర్గాల్లో కొత్త గుబులు రేపుతోంది. ఏం జరుగుతుందా? అన్న ఉత్కంట నెలకొంది.

 విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో తల్లీ కొడుకులతో పాటు.. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుమన్ దుబే.. మోతిలాల్ వోరా.. అస్కార్ ఫెర్నాండెజ్.. శ్యాం పిట్రోడా.. యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ప్రతినిధిని మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో అమ్మా.. కొడుకులతో పాటు.. మిగిలిన పెద్ద మనుషులంతా ఢిల్లీ హైకోర్టు గుమ్మం తొక్కనున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కంటి సైగతో దేశాన్ని శాసించిన సోనియమ్మ కోర్టు గుమ్మం తొక్కటం అంత చిన్న విషయం కాదు. ఏమైనా.. తమ పాలనలో ఎంతోమంది నేతల్ని.. అధికారుల్ని కోర్టు చుట్టూ తిప్పిన సోనియమ్మ అండ్ కో.. తాజాగా కోర్టు గుమ్మం తొక్కాల్సి రావటం చూస్తే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News